మద్యాన్ని దశలవారీగా తగ్గించుకుంటూ వస్తున్న ఏపీ సర్కార్… అక్రమ రవాణా పెరగకుండా.. గుడుంబా, నాటు సారాల్లాంటివి తయారు చేయకుండా కట్టడి చేయాలని నిర్ణయించుకుంది. అలాగే ఇసుక కూడా అక్రమ రవాణ ఉండకూడదని.. ఓ పద్దతి ప్రకారం ఉండాలని డిసైడయింది. ఇందు కోసం ఏం చేయాలా.. అని మేధోమథనం చేసి.. చివరికి ప్రత్యేక వ్యవస్థను నిర్మించాలని నిర్ణయించుకుంది. మద్యం, ఇసుక అవకతవకల నివారణకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలనశాఖలో భాగంగా ఈ బ్యూరో పని చేస్తుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధిపతిగా డీజీపీ ఉంటారు.
కమిషనర్, కమిషనరేట్ ఆధ్వర్యంలో చేస్తుంది. 13 జిల్లాల్లో 18 యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లాలో ఒక అడిషనల్ ఎస్పీకి బాధ్యతలు అప్పగిస్తారు. ఇక నుంచి మద్యం, ఇసుక అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులు… దర్యాప్తులు అన్నీ ఈ విభాగమే చూస్తుంది. ఏపీ సర్కార్ మద్యం విధానంలో భాగంగా .. సొంత మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన తర్వాత పరిమితమైన బ్రాండ్లు విక్రయిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దులు ఎక్కువగా ఉండటంతో… ఆయా రాష్ట్రాల్లో మెరుగున బ్రాండ్లు.. తక్కువ రేటుకే వస్తూండటంతో.. చాలా మంది.. దీన్నో వ్యాపారంగా మార్చుకుని పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చి ఏపీలో విక్రయిస్తున్నాయి.
లాక్ డౌన్ సమయంలోనే ఇలాంటి వారు పలువురు పట్టుబడ్డారు. సరిహద్దు ప్రాంతాలపై పటిష్టమైన నిఘా ఉండాలని.. లేకపోతే అక్రమ మద్యం నియంత్రించలేమన్న అభిప్రాయానికి ఏపీ సర్కార్ వచ్చింది. అలాగే ఇసుక కూడా.. ఇసుక విషయంలో తేడా వస్తే.. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.