తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్లీ టచ్ రాజకీయాలు ప్రారంభించింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించుకున్నారు. హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో హుషారు కనిపిస్తోంది. గతంలో తమతో టచ్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలను మళ్లీ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తోంది. వారు కూడా వివిధ కారణాలతో రెడీ అవుతున్నారు.
బీఆర్ఎస్ పూర్తిగా సోషల్ మీడియాకే పరిమితమైపోయిందన్న భావనలో తెలంగాణ రాజకీయవర్గాలు ఉన్నాయి. యూట్యూబ్ చానళ్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తే సరిపోతుందన్నట్లుగా పరిస్థితి ఉందన్న అభిప్రాయం ఆ పార్టీ ఎమ్మెల్యేలో ఉంది. ప్రభుత్వంపై సానుకూలత ఉన్నా లేకపోయినా ప్రజలు మరోసారి బీఆర్ఎస్ వైపు చూస్తారన్న నమ్మకం తగ్గిపోతూండటంతో.. ప్రత్యామ్నాయం చూసుకునేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇంకా మంత్రివర్గ విస్తరణ చేయలేదు. కొత్తగా వచ్చే నేతలు ఉంటారన్న కారణంగానే ఆగారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో చేరికలపై చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు మరోసారి కొంత మందిని చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.