తిరుమల లడ్డూ వివాదం, కల్తీ నెయ్యి ఆరోపణలపై దోషులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇక ఈ అంశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. జరిగిన తప్పుకు క్షమించాలంటూ పవన్ 11 రోజుల పాటు దీక్ష చేస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం కూడా చేశారు. ఇటు తిరుమలలోనూ సంప్రోక్షణ, శుద్ధి, మహా శాంతి యాగాన్ని నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షను తిరుమల వెంకన్న సమక్షంలో విరమించనున్నారు. అందులో భాగంగా వచ్చే నెల 1వ తారీఖున అలిపిరి మెట్ల మార్గంలో… కాలినడకన పవన్ తిరుమల చేరుకోబోతున్నారు. 2వ తేదీన వేంకటేశ్వరుడి దర్శనం చేసకుంటారని జనసేన వర్గాల సమాచారం. 3వ తేదీన తిరుపతిలో వారాహి సభ కూడా నిర్వహించబోతున్నారు.
ఇక, తిరమలలో కల్తీ నెయ్యి వివాదంలో… ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన తడి బట్టలతో ప్రమాణం చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఒకవేళ తప్పు చేస్తే తన కుటుంబం సర్వనాశనం కావాలన్నారు.