రాజకీయ నాయకుల తీరు చిత్రంగా ఉంటుంది. సిట్యూయేషన్‌కు తగ్గట్లుగా వారు భావోద్వేగాలను ప్రదర్శిస్తూంటారు. వాటిని నియంత్రించుకోవడం మాత్రమే కాదు.. ప్రదర్శించడం కూడా.. పెద్ద టాస్క్. కొంత మంది ప్రసంగిస్తూ.. తమ అభిమాన నేతను తలుచుకుని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటారు. మరొకరు.. ఆనందభాష్పాలు రాలుస్తారు. మరొకరు గద్గద స్వరంతో కాసేపు మాట్లాడటం ఆపేస్తారు. ఇలా.. రకరకాలుగా రాజకీయ నేతల భావోద్వేగం ఉంటుంది. కానీ.. ఏ కారణం లేకుండా.. ఓ బహిరంగ కార్యక్రమంలో ఇలా భావోద్వేగం గురవడం మాత్రం.. చాలా అరుదు. ఇలాంటి పరిస్థితిని .. ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఎదుర్కొన్నారు.
విజయనగరం జిల్లాలో విజయసాయిరెడ్డి ఎన్నికల సన్నాహక శిబిరం ఏర్పాటు చేశారు. పార్టీ నేతలంతా వచ్చారు. కింది స్థాయి క్యాడర్‌కు విజయసాయిరెడ్డి.. బొత్స దిశానిర్దేశం చేశారు. వేదికపై విజయసాయిరెడ్డి పక్కన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కూర్చున్నారు. అందరూ సీరియస్‌గా ఎన్నికల గురించి చర్చిస్తూంటే.. ఆమె మాత్రం.. కన్నీళ్లు పెట్టుకున్నారు. సరే జగనన్న చేసిన మంచి గురించి ఆమె.. తల్చుకుని ఆనంద భాష్పాలు రాలుస్తున్నారేమో అని అనుకోవడానికి కూడా అక్కడ పరిస్థితి లేదు. దాని గురించి చర్చ జరగడం లేదు. కానీ ఆమె కళ్ల వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎక్కిళ్లు కూడా వచ్చాయి. వెంటనే గన్‌మెన్ వద్ద కర్చీఫ్ తీసుకుని కవర్ చేసుకున్నారు.
ఆమె ఏడుస్తున్నట్లుగా చూసిన విజయసాయిరెడ్డి ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆయన మాటలతోనే సముదాయించినప్పటికీ.. అప్పటికి తేరుకున్నట్లుగా కనిపించిన పుష్పశ్రీవాణి కళ్ల వెంట కన్నీళ్లు ఆగలేదు. విజయసాయిరెడ్డికి మరో పక్కన ఉన్న బొత్స కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే.. అసలు పుష్పశ్రీవాణి ఎందుకు ఏడ్చారు..? ఆమెకు ఏమి గుర్తొచ్చింది..? అన్నదానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. పర్సనల్ ప్రాబ్లమ్స్ అయి ఉంటాయని కొంత మంది చర్చించుకున్నారు. జగన్ పై అమితమైన అభిమానం చూపే.. పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియోలతో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.