ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటల తీరును బట్టి అంచనా వేసి… ఫిరాయింపుల ఒక సంకేతంగా తెలుగు 360 డాట్ కాం విశ్లేషించిన ఒక వైనం ఇప్పుడు వాస్తవం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మదనపల్లె ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి తెలుగుదేశంలో చేరవచ్చుననే ప్రచారం శనివారం నాడు ముమ్మరంగా జరిగింది. ఆయన శనివారంనాడు చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో భేటీ కావడమే ఈ ప్రచారానికి కారణంగా కనిపిస్తోంది.
మదనపల్లెకు చెందిన దేశాయి తిప్పారెడ్తి తెలుగుదేశంలో చేరవచ్చుననే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. దానికి తగినట్లుగా ఇటీవలి శాసనసభ సమావేశాల్లో సాగునీటి పథకాల గురించి సీఎం మాట్లాడుతూ.. మీమీ నియోజకవర్గాలకు కూడా నీళ్లు ఇస్తాం.. అంటూ ప్రత్యేకంగా పలమనేరు ఎమ్మెల్యే అమరనాధరెడ్డి, మనదపల్లె ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిలను ఉద్దేశించి.. మీ నియోజకవర్గాలకు కూడా మీరు అడ్డుపడినా సరే నీళ్లు ఇవ్వబోతున్నాం అంటూ సెలవిచ్చారు. ఈ ఇద్దరూ తెదేపా పట్ల సానుకూలంగా ఉన్నారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇలా వారిద్దరినీ ప్రత్యేకించి మాట్లాడడం ద్వారా సీఎం చంద్రబాబు మరింత సంకేతాలు ఇచ్చారని తెలుగు360 ఒక విశ్లేషణ అందించింది.
అందులో అంచనా వేసినట్లు దేశాయి తిప్పారెడ్డి తెదేపాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం నాడు హంద్రీనీవా ప్రాజక్టు కాలువల పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించడానికి చిత్తూరు జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబును మదనపల్లెలో దేశాయి తిప్పారెడ్డి కలిశారు. వారిద్దరూ విడిగా సమావేశమై మాట్లాడుకున్నట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను కలిశా అని చెప్పడం మామూలే గానీ.. అదే సాకు చెప్పి పార్టీలు మారిపోతున్న వైనం కూడా మనం గమనించాల్సి ఉంది. మరి దేశాయి గారు.. జగన్‌కు గుడ్‌బై చెప్పే ముహూర్తాన్ని ఎప్పటికి సెట్ చేసుకున్నారో వేచిచూడాలి.