జగన్‌కు అత్యంత సన్నిహితులు, బినామీలుగా పేరు పడిన వారు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారంటూ విదేశీయుల నుంచి వచ్చిన ఫిర్యాదులు కేంద్రానికి అందాయని.. బీజేపీ అధికారిక మీడియా లాంటి రిపబ్లిక్ చానల్ ప్రకటించడం ఏపీలో సంచలనం అవుతోంది. ఈ మేరకు తెలుగు 360 ఇచ్చిన కథనం.. వైరల్ అయింది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశం అయింది. సహజంగానే ఈ కథనంపై వైసీపీ నేతలు నోరు తెరవలేదు. కానీ విపక్షనేతలు మాత్రం… అంతర్జాతీయ స్కామ్‌లు చేస్తున్నారని.. త్వరలో జైలుకెళ్లే రాత మళ్లీ ఉందని విమర్శలు చేస్తున్నారు. అయితే ఎవరికీ..అసలు కేసేంటి అన్న విషయంపై స్పష్టత లేదు.
కేంద్రానికి ఫిర్యాదు చేసిన విదేశీయులు.. ఆషామాషీగాఫిర్యాదు చేయలేదు. చాలా పక్కా ఆధారాలతో జగన్ సన్నిహిత ఆర్థిక నేరాల గురించి సమాచారంతో సహా… ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ అంశంపై కేంద్రం దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయని అంటున్నారు. ఇప్పటికే అంతర్గత దర్యాప్తు కూడా చురుకుగా సాగుతోందని అంటున్నారు. లోకల్‌గా జరిగే అవినీతి అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహారం ఎలా ఉన్నా.. విదేశీయుల నుంచి.. అదీ కూడా విదేశాల్లో చేస్తున్న ఆర్థిక అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులు దేశ ప్రతిష్టకు సంబంధించినవి కాబట్టి సీరియస్‌గా తీసుకున్నారని చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో కొంత మంది జగన్ అనుచరులు.. సన్నిహితులు.. బినామీలుగా పేరు తెచ్చుకున్నవారు.. విదేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు ప్రయత్నించారని అంటున్నారు. అయితే అనేక దేశాల్లో అలాంటి పెట్టుబడులకు ఆదాయ వివరాలు సంపూర్ణంగా ఆయా దేశాలకు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో చట్టాలతో పాటు విదేశాల్లో ఉండే వివిద రకాల వెసులుబాట్ల ఆధారంగా … ఆదాయ వనరుల గురించి చెప్పకుండానే పెట్టుబడులు పెట్టేవారు. వాటిని మళ్లీ సూట్ కేసు సంస్థల ద్వారా ఇండియాకు రప్పించేవారు. ఇలాంటి కేసులు పెద్ద ఎత్తున ఇండియాలో నమోదయ్యాయి. బహుశా.. ఇలాంటి వాటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు అందాయన్న ప్రచారం జరుగుతోంది.
నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా ప్రస్తుతం జగన్ కి ట్రబుల్ అంటూ… రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన కథనానికి చాలా లోతైన అర్థం ఉందని అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించిన సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తాయని విపక్ష నేతలు అంచనా వేస్తున్నారు. సీఎం జగన్ మూడు రోజుల కిందట… ఢిల్లీకి వెళ్లి అర్జంట్‌గా అమిత్ షా, మోడీలతో సమావేశం కావాలనుకున్నారు. నేరుగా సీఎంవో ద్వారా వారి అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అపాయింట్మెంట్లు ఖరారు కాకపోవడంతో ఢిల్లీ వెళ్లలేదు. ఇప్పుడీ విషయానికి… విదేశీయులు చేసిన ఫిర్యాదులకు కలిపి.. విమర్శలు చేస్తున్నారు విపక్ష నేతలు.