అల్లు అర్జున్ ను రిమాండ్ కు పంపడంతో రిమాండ్ రిపోర్టును కూడా జైలుకు సమర్పించారు. ఆ రిమాండ్ రిపోర్టులో అల్లు అర్జున్ ఏం నేరం చేశారో స్పష్టంగా పేర్కొన్నారు. అల్లు అర్జున్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ర్యాలీగా సినిమా ధియేటర్ కు వచ్చారు. అప్పటికే ధియేటర్ లో షో టిక్కెట్లు అన్నీ అమ్మేశారు. రూ. వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలకు టిక్కెట్లు అమ్మారు. ఆ టిక్కెట్లు కొనుక్కున్న వారందరూ ధియేటర్ కు వచ్చారు. అదే సమయంలో అర్జున్ ర్యాలీగా ధియేటర్ కు వచ్చారు.
అర్జున్ తో పాటు వచ్చిన ఆయన అభిమానులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది టిక్కెట్లు కొనుక్కున్న వారిని తోసేసి తాము లోపలికి వెళ్లిపోయారు. అక్కడే తీవ్రమైన తొక్కిసాలట జరిగింది. అంటే టిక్కెట్లు కొనుక్కున్న వారిని తోసేసి టిక్కెట్లు లేని అల్లు అర్జున్ తో వచ్చిన వారు ధియేటర్ లోకి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. దీనికి అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా కారణం అయ్యారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
కోర్టుల్లో న్యాయవాదులు ఈ విషయాల గురించి పెద్దగా ప్రస్తావించినట్లుగా లేదు. రిమాండ్ రిపోర్టును పోలీసులు బలంగానే సిద్ధం చేశారు. అయితే ధియేటర్ యాజమాన్యం నుంచి మరో భిన్నమైన వాదన వినిపిస్తోంది. రెండు రోజుల ముందే పర్మిషన్ తీసుకున్నామని అంటున్నారు. కానీ తాము ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వారు విడుదల చేసిన లేఖ.. ఫార్మాలిటీగా ఇచ్చేదని.. వ్యక్తిగతంగా కలిసి తీసుకున్నది కాదని అంటున్నారు. మొత్తంగా అల్లు అర్జున్ కేసు వ్యవహారం టాలీవుడ్ లో పెనుప్రకంపనలు సృష్టించింది.