మైత్రీ మూవీస్ సంస్థపై ఐటీ శాఖ దాడి చేసి, తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం మైత్రీ మూవీ ఆఫీసుపై ఐటీ రైడ్ మొదలైంది. ఇంకా.. కొనసాగుతోంది. గతంలో కూడా మైత్రీపై ఐటీ శాఖ రైడ్ చేసింది. అప్పట్లో పెద్దగా అవకతవకలు బయటపడలేదు. ఈసారి మాత్రం ఐటీ శాఖ కొంత కీలకమైన సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మైత్రీ మూవీస్ లో రాజకీయ నాయకులు బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ఎం.ఎల్.ఏ మైత్రీలో నేరుగా పెట్టుబడి పెట్టార్ట. ఆ వివరాల్ని ఐటీ శాఖ సేకరించినట్టు సమాచారం.
అంతేకాదు.. నవీన్ ఎర్నేని శంకర్‌పల్లిలో 200 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఆధారాల్ని ఐటీ శాఖ సేకరించినట్టు తెలుస్తోంది. ఆ లావాదేవీల గుట్టుని కూడా ఐటీ లాగుతోందని తెలుస్తోంది. మైత్రీ నిర్మిస్తున్న సినిమాలేంటి? వాటికి పెట్టుబడి ఎవరు పెడుతున్నారు? అనే విషయాల్ని ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. మైత్రీ మూవీస్‌లో రూపొందించిన పుష్పకి భారీ లాభాలొచ్చాయి. ఆ లాభాల్ని ఏ రూపంలో మళ్లించారన్న విషయాలపై ప్రశ్నలు సంధిస్తున్నట్టు సమాచారం. పుష్ప 2కి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంపై కూడా.. ఐటీ దృష్టి పెట్టింది.