హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఆయుత మహా చండీయాగాన్ని తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చండీయాగంకోసం పనులు ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం సమీపంలోని 22 ఎకరాలలో భూమిని చదును చేసే పని మొదలుపెట్టారు.
త్రిదిండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాగంలో దేశం నలుమూలలనుంచి 1,100 మంది వేదపండితులు, పీఠాధిపతులు పాల్గొననున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లుకూడా హాజరయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడిలను సీఎమ్ కేసీఆర్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఆయుత మహా చండీయాగం లక్ష చండీయాగాలతో సమానమని, దీనినే శతసహస్ర చండీయాగమని అంటారని చెబుతున్నారు. కొన్ని దశాబ్దాలక్రితం శృంగేరి పీఠం అధ్వర్యంలో ఆయుత చండీయాగం నిర్వహించారని, ఆ తర్వాత దేశ చరిత్రలో మరెక్కడా ఈ యాగం నిర్వహించిన దాఖలాలు లేవని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కరవుతో అల్లాడుతున్న తెలంగాణ సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ చండీయాగాన్ని నిర్వహించాలని కేసీఆర్ సంకల్పించారని నిర్వాహకులు అంటున్నారు. అత్యంత నియమ నిష్ఠలతో ఈ యాగం చేయాల్సి ఉంటుందని, ఇది సాహసోపేత నిర్ణయమని చెబుతున్నారు. ఒక చండీయాగంతో కోటి యజ్ఞాల ఫలం వస్తుందని, ఆయుత చండీయాగంతో లక్ష కోట్ల యజ్ఞాల ఫలం లభిస్తుందని వేదపండితులు చెప్పినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
మరోవైపు ఈ యాగంకోసం 10 టన్నుల మోదుగ కర్రలను సేకరిస్తున్నారు. రోజూ దాదాపు 10 క్వింటాళ్ళ నెయ్యి అవసరమవుతుందని, ఆ మేరకు సిద్ధం చేస్తున్నారు. నిత్యం సుమారు 30 వేలమంది భోజనాలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేద పండితులు, పీఠాధిపతులకోసం తాత్కాలిక ఆవాసాలు నిర్మించనున్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయే ఈ ఆయుత చండీయాగం నిర్వహణపై అన్ని వర్గాల ప్రజలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ నిర్వాహకులను ఆదేశించినట్లు సమాచారం.