సుమారు రెండు దశాబ్దాల క్రితం… సరిగ్గా చెప్పాలంటే పంతొమ్మిదేళ్ల క్రితం.. హాలీవుడ్లో ‘ఎనలైజ్ దిస్’ అని ఓ సినిమా వచ్చింది. సినిమా కథ గురించి చెప్పడం కంటే… ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.
‘ఎనలైజ్ దిస్’ ట్రైలర్ చూశారా? ఇప్పుడు ఓసారి కింగ్ నాగార్జున, నాని హీరోలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా ‘దేవదాస్’ ట్రైలర్ గుర్తు చేసుకోండి. రెండిటి మధ్య పోలికలు ఏవైనా కనిపిస్తున్నాయా? కనిపిస్తే తప్పు ప్రేక్షకులది తప్పు కాదు. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమాకు కాపీగా ‘దేవదాస్’ వస్తుందని టాక్. ఇందులో హీరోలు ఇద్దరికీ హీరోయిన్లు వున్నారు. పాటలు, ప్రేమ సన్నివేశాలు వున్నాయి. ‘మహానటి’ విజయం తరవాత వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న సినిమా ఇది. సినిమా ఎలా మొదలైంది? అనేది మొన్న ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. “ముంబై రైటర్ శ్రీధర్ రాఘవన్ ఈ స్టోరీ లైన్ చెప్పాడు. నాకు నచ్చడం హీరోలకు చెప్పమని చెప్పా. నాగార్జునకు, నానికి కూడా నచ్చేసింది. ఆ చిన్ని స్టోరీ లైన్‌ని భూపతిరాజా కథగా రాస్తే.. సత్యానంద్ సహాయ సహకారాలు అందించారు. తరవాత ఈ కథను ఎవరు దర్శకత్వం వహిస్తే బావుంటుందని ఆలోచించి ఆలోచించి.. శ్రీరామ్ ఆదిత్యను హీరోలు ఎంపిక చేశారు. మళ్ళీ రచయితలతో కలిసి దర్శకుడు కొంత స్క్రిప్ట్ వర్క్ చేశార” – ఇదీ అశ్వినీదత్ వెర్షన్. ఈ క్రమంలో ఎవరూ ఇదో హాలీవుడ్ సినిమాకు కాపీ అని గుర్తించలేదో? లేదంటే తెలిసే కాపీ చేశారో?
వంశీ పైడిపల్లి ఫ్రెంచ్ సినిమా ‘ది ఇన్‌టచబుల్స్’ డీవీడీ ఇవ్వగా తాను చూశానని, నచ్చడంతో ‘ఊపిరి’ సినిమా చేశానని నాగార్జున గతంలో చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.