సోషల్ కథలో, ఫాంటసీ అంశాల్ని మిక్స్ చేయడం ఈమధ్య బాగా కనిపిస్తోంది. చూడ్డానికి మామూలు కథలాన్నా, ఎక్కడో ఓ చోట దేవుడు, మహిమలూ, విశ్వరూప దర్శనాలూ కనిపిస్తుంటాయి. ‘దేవకీ నందన వాసుదేవ’ కూడా ఆ తరహా కథే. టైటిల్ కు తగ్గట్టుగా శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతంతో ముడి పడిన కథ ఇది. ట్రైలర్లో డైలాగులు, ఆ మెటాఫర్ చూస్తుంటే – శ్రీకృష్ణుడి కథని పూర్తిగా సోషలైజ్ చేసినట్టు కనిపిస్తోంది. అశోక్ గల్లా కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అర్జున్ జంథ్యాల దర్శకత్వం వహించారు. ఈనెల 22న విడుదల కానుంది. నిజానికి నవంబరు 14నే రావాలి. కానీ ఓ వారం వెనక్కి వెళ్లింది.
ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు. ముందే చెప్పినట్టు హీరో, విలన్ పాత్రలు కృష్ణుడు – కంశుడిని పోలి ఉన్నాయి. వాళ్ల మధ్య పగ, పంతం.. ఇవన్నీ తెరపై కనిపిస్తున్నాయి. క్లైమాక్స్ లో కృష్ణుడి విశ్వరూప దర్శనం బోనస్. విజువల్స్ బాగున్నాయి. ఓ లవ్ స్టోరీకి మైథాలజీ టచ్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. ప్రశాంత్ వర్మ అందించిన కథ కావడంతో, సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఆయన కథల్లో ఏదో ఓ మ్యాజిక్ ఉంటుంది. అది ‘దేవకీ నందన’లోనూ కనిపిస్తోంది. అశోక్ గల్లా లుక్స్ మాసీగా ఉన్నాయి. వారణాసి మానస ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతోంది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. భీమ్స్ అందించిన పాటల్లో ‘ఏమైందే ఈ గుండెకు’ పాపులర్ అయ్యింది. బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు.