టాలీవుడ్ లో దేవర ఫీవర్ మొదలైపోయింది. ట్రైలర్ రాకతో.. ఆ వేడి మరింత పెరిగింది. ఎక్కడ చూసినా ట్రైలర్ గురించే చర్చ. దేవర కథ ఇదేనా? అంటూ ట్రైలర్ చూసిన వాళ్లంతా తమకు తోచిన కథని రాసేసుకొంటున్నారు. మంగళవారమే సినిమా సెన్సార్ కూడా అయిపోయింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం చూస్తే.. దేవర కమర్షియల్ గా గట్టెక్కేసే సత్తా ఉన్న సినిమానే. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, యాక్షన్, సముద్రం బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఈ సినిమాని కాపాడే ప్రధాన అస్త్రాలని కొరటాల శివ నమ్ముతున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా క్లైమాక్స్ పై ఎక్కువ ఆశలు పెట్టుకొన్నాడు. అక్కడ వచ్చే ట్విస్టులు ఈ కథని మరో స్థాయికి తీసుకెళ్తాయని తెలుస్తోంది. సినిమా అంతా అయిపోయాక కూడా మరో బలమైన ట్విస్ట్ రానున్నదంట. ఈ ట్విస్టే రెండో భాగానికి నాంది పలకబోతోందని టాక్. ఎన్టీఆర్ కూడా క్లైమాక్స్ అదిరిపోయిందని, చివరి 40 నిమిషాలూ మరో స్థాయిలో ఉంటుందని చెప్పడానికి కారణం ఇదే అని తెలుస్తోంది.
ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ మధ్య జరిగే లవ్ స్టోరీ సెకండాఫ్లో వస్తుందని తెలుస్తోంది. ఈ లవ్ స్టోరీ ఎంతలా రిచ్ అవుతుందన్నదాన్ని బట్టి… `దేవర` రేంజ్ ఆధారపడి ఉంది. ఈ లవ్ స్టోరీ గనుక జనాలకు ఎక్కేస్తే ‘దేవర’కు తిరుగులేదు. లేదంటే కనీసం యావరేజ్ మార్క్ దగ్గరైనా ఆగుతుందని, అంతే తప్ప, సినిమాపై ఎలాంటి డౌటూ లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈమధ్య క్లయిమాక్సులు బాగుంటే సినిమాలు నిలబడిపోతున్నాయి. సలార్, కల్కి క్లైమాక్సులే ఆయా సినిమాల్ని నిలబెట్టాయి, ‘దేవర’ నమ్మకం, ధైర్యం కూడా అదే. ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్రబృందం ముంబైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే హైదరాబాద్ లో ఓ భారీ ఈవెంట్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి తెలుగు నాట ‘దేవర’ ప్రమోషన్లు మరింత జోరందుకొంటాయి.