‘పుష్ప 2’కి సంబంధించిన ఈవెంట్లన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
ఈ విషయంలో మైత్రీ మూవీస్ ప్లానింగ్ ని అభినందించాల్సిందే.
ముఖ్యంగా పాట్నాతో ప్రచార యాత్ర మొదలెట్టాలన్న ఆలోచన భేష్. ‘పుష్ప 2’కి నార్త్ లో ఎంత హైప్ ఉందో ఆ ఈవెంట్ తో అర్థమైపోయింది. పాట్నాలో కనిపించిన జోష్… దేశమంతటా పాకేసింది. ఆ తరవాత ఈవెంట్లన్నీ సూపర్ హిట్టే. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో ప్రచార కార్యక్రమాలకు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ ఈవెంట్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ముఖ్యంగా పాస్ ల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు. ఫ్యాన్స్ వస్తారో రారో అనుకొంటే విచ్చలవిడిగా పాస్లు కొట్టించి, అవి పంచేసి, వచ్చిన వాళ్లందరినీ సభా ప్రాంగణంలోకి అనుమతించక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ‘దేవర’ విషయంలో అదే జరిగింది. ఆ తప్పు ఈసారి పునరావృతం కాకుండా చూసుకొన్నారు.
ఈ విషయంలో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియాని కూడా అభినందించాల్సిందే. వేదిక చివరి నిమిషం వరకూ ఖరారు కాలేదు. అసలు ఉంటుందో లేదో కూడా తెలీదు. పోలీసుల అనుమతులు తీసుకొని, అప్పటికప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించి ముందుకు నడిపించడం మామూలు విషయం కాదు. దేవర ఈవెంట్ ఫ్లాప్ అవ్వడంతో శ్రేయాస్ మీడియా ఇబ్బంది పడింది. పుష్ప 2తో మళ్లీ పరువు నిలబెట్టుకొంది. దేవర ఈవెంట్ చూశాక అసలు తెలంగాణలో అందులోనూ హైదరాబాద్ లో పెద్ద పెద్ద సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు అనుమతులు దొరకవేమో, దేవరతోనే ప్రీ రిలీజ్ ముచ్చట ముగుస్తుందేమో అనుకొన్నారు. ప్లానింగ్ ప్రకారం చేస్తే ఈవెంట్లు సక్సెస్ చేయొచ్చని ‘పుష్ప 2’ నిరూపించింది. ఇక మీదట పెద్ద సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలు హాయిగా చేసుకోగలం అనే ధైర్యం కూడా నిర్మాతలకు వచ్చింది.