ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా కలర్, థీం పై ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి ఇప్పటివరకూ బయటికి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా డార్క్, రస్టిక్ బ్యాక్ డ్రాప్ లో కనిపించాయి. ప్రతి కంటెంట్ లో ఎరుపెక్కిన సముద్రాన్నే చూపించారు. అయితే దీనికి పూర్తిగా భిన్నమైన ఓ పాటని ఇప్పుడు బయటికి వదిలారు.
ఎన్టీఆర్ జాన్వి కపూర్ పై చిత్రీకరించిన చుట్టమల్లె పాట చాలా కలర్ ఫుల్ గా వుంది. నిజానికి దేవర కలర్ టోన్ చూస్తే ఇలాంటి ఒక అందమైన మెలోడీ డ్యూయెట్ కి స్కోప్ ఉంటుందా అనిపించింది. కానీ దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకునే మాంఛి పాటని ప్లేస్ చేయగలిగారు. అనిరుధ్ ట్యూన్ క్యాచిగా వుంది.
”చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నా మైమరపు చేతనైతే నువ్వే నన్నాపు’ అంటూ సాగిన పల్లవిలో రామజోగయ్య శాస్త్రి మార్క్ కనిపించింది.
వాస్తుగా పెంచా నేనే వంద కోట్ల సొగసిది – ఆస్తిగా అల్లేసుకో కొసరీ కొసరీ..
ఏ బంగరు నక్లీసూ నా ఒంటికి నచ్చట్లే – నీ కౌగిలితో నను సింగారించూ.. అనే చోట్ల జోగయ్య పెన్ను సింగారాన్ని బాగా ఒలికించినట్టు కనిపిస్తుంది.
ఎన్టీఆర్, జాన్వి కెమిస్ట్రీ ఫ్రెష్ గా వుంది. ఈ పాటలో ఎన్టీఆర్ సొగసైన డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేకంగా నిలిచాయి. వినగానే నచ్చేసి, ఆ తరవాత స్లో పాయిజన్లో ఎక్కేసే కైపు.. ఈ పాటలో ఉంది. జాన్వీ వెండి తెరపై ఎలా కనిపించబోతోందో చెప్పడానికి ఈ పాటలో మూమెంట్స్ నిదర్శనంగా నిలుస్తాయి. సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకువస్తోంది.