మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ… రాజకీయంగా యాక్టివ్ గా మారిపోయారు. కుమారుడు ప్రభుత్వ వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీని డీల్ చేస్తూంటే.. దేవేగౌడ రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ మధ్య వ్యవహారం అంత సాఫీగా సాగడం లేదు. మంత్రి పదవుల విషయాన్ని ఎలాగోలా తేల్చుకుంటే.. విధానపరమైన విషయాల్లో ఇంకా అనేక విబేధాలొస్తున్నాయి. రుణమాఫీ వ్యవహారం కర్ణాటకలో పెద్ద ఇష్యూ అయిపోయింది. రుణమాఫీ చేయకపోతే… యడ్యూరప్ప… రంగంలోకి దిగడానికి రెడీగా ఉన్నారు. కుమారస్వామి.. ఎలాగోలా రుణమాఫీ చేద్దామని ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అభ్యంతరాలొస్తున్నాయి. కుమారస్వామి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా కాంగ్రెస్ నేతలు అడ్డుతగులుతున్నారు.
ఈ పరిణామాలతో దళపతి దేవేగౌడ.. కాంగ్రెస్ ను లైన్లోకి తేవడానికి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. కాంగ్రెస్ కాకపోతే..మాకు బీజేపీ కూడా ఉందని అర్థం వచ్చేలా తరచూ బ్లాక్ మెయిల్ ప్రకటనలు చేస్తున్నారు. అవి కూడా వర్కవుట్ కాకపోతే.. బీజేపీకి చెందిన ఎవరో ఒక నేతతో రహస్యంగా సమావేశమై ఆ సమాచారాన్ని లీక్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ సీరియస్ గా చేయడం లేదా అంటే… సీరియస్ గా చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే.. కొంత కాలంగా.. భారతీయ జనతా పార్టీ.. జేడీఎస్ కోసం… ప్రయత్నిస్తోంది. ఫిట్నెస్ చాలెంజ్ ల పేరుతో మోడీ.. కుమారస్వామిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించారు. అంతర్గతంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మిత్రులు కరవైన బీజేపీకి ఇప్పుడు జేడీఎస్ అవసరం చాలా ఉంది.
అనూహ్యంగా దేవేగౌడ.. బీజేపీతో ప్యాచప్ కోసం.. సీరియస్ గాప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీకి మిత్రులను వెతికి పెట్టే పని చేస్తున్న కేసీఆర్తో సంప్రదింపుల కోసం దేవేగౌడ హైదరాబాద్ లో రాజకీయం ప్రారంభించారు. వీరి మధ్య చర్చలు కీలకమయ్యే అవకాశం ఉంది. బీజేపీకి కేసీఆర్ డీల్ సెట్ చేసి పెడితే… కర్ణాటకలో రాజకీయం మారిపోయే అవకాశం ఉంది. అదే సమయంలో కర్ణాటకలో… యడ్యూరప్ప.. చాలా డేర్ గా ఓ ప్రకటన చేశారు. ఎమ్మెల్యేలు పట్టుకొచ్చేయండి.. తన పార్టీ నేతలకు ఆదేశం లాంటి విజ్ఞప్తి చేశారు. దాంతో… అప్పటి వరకూ కాట్లాడుకున్న కుమారస్వామి, కాంగ్రెస్ ఒకే మాట మీదకు వచ్చి.. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. అందులో ఒకటి కావేరీ మీద మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడం. ఇంత వరకూ బాగానే ఉన్నా… కర్ణాటక రాజకీయం..ముఖ్యంగా దేవేగౌడ… వేస్తున్న పాచికలు మాత్రం… కాస్తంత ఆసక్తికరమే.