వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయం తరువాత చర్చించుకుందామనీ, ముందుగా భారతీయ జనతా పార్టీని ఓడించడం ఒక్కటే లక్ష్యంగా పనిచేద్దామంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇటీవలే ఢిల్లీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాతో భేటీ అయిన సంగతీ తెలిసిందే. అయితే, ప్రాంతీయ పార్టీల కూటమికి కాంగ్రెస్ మద్దతు ఇస్తానంటున్న నేపథ్యంలో… ప్రధాని అభ్యర్థిత్వంపై కొంత జరిగింది. ఇతర పార్టీలూ మీడియా కూడా మమతాని స్పష్టత కోరినా ఆమె ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు అదేమాటను మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ చెప్పడం ఆసక్తికరంగా ఉంది!
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఉంటే మద్దతు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, జేడీయూల ఉమ్మడి అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగితే పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. భాజపాకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలను ఏకం చేయడంలో కాంగ్రెస్ క్రియాశీల పాత్ర పోషిస్తుందన్నారు. అంతేకాదు, మమతా అభ్యర్ధిత్వాన్ని ప్రతిపాదిస్తూ.. ఇందిరా గాంధీ దేశాన్ని 17ఏళ్లపాటు పరిపాలించారనీ, ఎప్పుడూ మగాళ్లు మాత్రమే ప్రధానులుగా వ్యవహరించాలా, మమతా లేదా మాయవతి లాంటివాళ్లకు ఎందుకు ఉండకూడదంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో భాజపాని ఓడించాలంటే జాతీయస్థాయిలో ఒక బలమైన కూటమి అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాంటి ఆలోచన మమతా లేదంటున్నా దేవెగౌడ ప్రతిపాదించడం విశేషం! మహాకూటమి ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధమౌతున్నా కూడా.. ప్రధాని అభ్యర్థిత్వం అనే అంశం దగ్గరే కొంత మీనమేషాలు లెక్కిస్తున్నాయి. వాస్తవానికి ఆ చర్చ ఇప్పుడు అనవసరం కాబట్టే, ముందుగా భాజపాని ఓడిద్దామని మమతా పిలుపునిచ్చారు. అయితే, ప్రాంతీయ పార్టీలతో కలిసి కదలాల్సిన అవసరం ఉంది కాబట్టి.. కాంగ్రెస్ కూడా ప్రస్తుతానికి ప్రధానమంత్రి అభ్యర్థిత్వ చర్చను పక్కనపెట్టాలనీ అనుకుంటోంది. కానీ, దేవెగౌడ అదే ముందు తేలాలన్నట్టుగా మమతా గురించి వ్యాఖ్యానించారు. పైగా కాంగ్రెస్ తరఫున కూడా ఆయన ఎస్ అన్నట్టు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా నిలపాలన్నది కాంగ్రెస్ ఏకైక లక్ష్యం! పరిస్థితులు చూస్తుంటే… కాంగ్రెస్ మద్దతు కూడా మమతాకి ఉండాలీ, ఉంటుందీ అన్నట్టు మిత్రపక్షం జేడీఎస్ అంటోంది.