ప్రస్తుతం అయోధ్య రామాలయం చుట్టూ రాజకీయం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు సానుకూలంగా రాకపోయేసరికి.. ఆర్డినెన్స్ లు తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. హిందూ సంస్థలు, ఆరెస్సెస్ కూడా అదే డిమాండ్ చేస్తోంది. కానీ ఇదంతా రాముడి భక్తేనా..?. కానే కాదు.. ఇదంతా రాజకీయం. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు వీరందిరికి ఎందుకు అయోధ్య గుర్తుకు వస్తోంది..? రాముడిపై అంత భక్తే ఉంటే.. తెలంగాణలో భద్రాద్రి ఉంది. శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడు. అది చాలా గొప్పది అందులో అనుమానం లేదు. కానీ భద్రాచలం కూడా గొప్పదే.
శ్రీరాముని జీవితంలో కీలక ఘట్టాలన్నీ భద్రాచలంలోనే..!
రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టం… అరణ్యవాసం. శ్రీరాముడు దండకారణ్యంలో నడయాడాడు. ఆయన నడయాడిన ప్రాంతం భద్రాచలం. సీతమ్మ తల్లి ఉన్న ప్రాంతం పర్ణశాల. అది భద్రాచలం పక్కనే ఉంది. రావణుడు.. సీతమ్మ తల్లిని అపహరించుకుపోయినటువంటి ప్రాంతం కూడా భద్రాచలమే. జటాయువు ఘట్టం.. శబరి ఘట్టం… జరిగిన పుణ్యక్షేత్రం ఇది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ప్రాంతానికి కేంద్రప్రభుత్వం ఒక్క రూపాయి కూడా.. అభివృద్ధికి కేటాయించారా..?. కనీసం హెరిటేజ్ సిటీ హోదా ఇచ్చారా..?. ఎంతో విశిష్టత కలిగిన భద్రచలానికి హెరిటేజ్ సిటీగా గుర్తింపు ఇద్దామన్న ఆలోచన కూడా కేంద్రానికి ఎందుకు రాలేదు..? . ఇంత వరకూ భద్రచలానికి రైలు మార్గం లేదు. ఇది ఆసాధ్యమైనదేమీ కాదు. లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న.. రైల్వే .. భద్రాచలానికి వెళ్లాలనుకునే భక్తులకు.. ఒక్క రైలు మార్గం వేయలేరా..?. నిజానికి వందల కిలోమీటర్ల ట్రాక్ వేయాల్సిన అవసరం లేదు. కొత్త గూడెం దగ్గర పాండు రంగాపురం అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ్నుంచి కేవలం పదమూడు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ వేస్తే చాలు భద్రాచలంలో రైల్వేస్టేషన్ ఉంటుంది. ఆ పదమూడు కిలోమీటర్ల రైలు మర్గం నిర్మిస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు… భద్రాచలం వస్తారు. అయినా ఎందుకు వేయడం లేదు..?
భద్రాచలం గురించి కేంద్రం ఎందుకు పట్టించుకోదు..?
భద్రాచలం ఆలయం తెలంగాణలో ఉంది. కానీ భద్రాచలం ఆలయానికి చెందిన భూములు ఐదు గ్రామాల్లో ఉన్నాయి. ఆ ఐదు గ్రామాలను… ఏపీలో కలిపారు. నిజానికి ఇవి ముంపు గ్రామాలు కాదు. అయినప్పటికీ.. ఏపీలో కలిశారు. శ్రీరాముడు తెలంగాణలో ఉంటారు.. కానీ శ్రీరాముల వారి భూములు ఏపీలో ఉన్నాయి. ఇలా ఏపీలో కలిపిన తర్వాత .. ఆ భూములన్నింటిని అయినా… రాముల వారి ఆలయానికి అనుసంధానం చేయమని అడిగితే.. కేంద్రం ఇంత వరకూ ఆ పని చేయలేదు. గట్టిగా చేయాలనుకుంటే… మోడీకి ముఫ్పై సెకన్లలో పని అయిపోతుంది. భద్రాచలంలో.. అర్థచంద్రాకారంలో గోదావరి ఉంటుంది. అక్కడ డంపింగ్ యార్డ్ పెడదామన్నా కూడా స్థలం లేదు. భద్రాచలం అభివృద్ధి విషయంలో అసలు పట్టించుకునేవారే లేరు. రైల్వే లైన్ సంగతి సరే.. అసలు గుడికి.. ప్లేస్ లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా..?. కనీసం సవరించడానికి కూడా కేంద్రానికి ఎందుకు మనసొప్పదు.
ముత్యాల తలంబ్రాలు సమర్పించని సీఎం కేసీఆరే..!
నిజాం నవాబు కాలం నుంచి ఓ ఆచారం ఉంది. పాలకులు ఎవరైనా భద్రాద్రి రామునికి ముత్యాల తలంబ్రాలు ఇస్తారు. శ్రీరాముడ్ని నమ్మని వారు.. నమ్మినవారైనా అదే చేసేవారు. కానీ కేసీఆర్ మాత్రం ఒక్క సారే వెళ్లారు. ఆధునిక కాలంలో… శ్రీవారికి వరుసగా రెండేళ్ల పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించని ముఖ్యమంత్రి కేసీఆరే. దీన్ని అంగీకరిద్దామా..? రూ. వంద కోట్లు భద్రాద్రి అలయానికి కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇచ్చారా..? పోనీ ప్రజాప్రతినిధులెవరైనా అడిగారా..?. అడగలేదు.. కానీ భక్తిపరమైన అంశాల్లో .. ఇతర వివాదాల్లో నేతల ప్రవర్తన ఎలా ఉంటుంది..? శబరిమల విషయంలో అంత ఆవేదన చెందుతున్న బీజేపీ నేతలు… భద్రాచలం గురించి మాత్రం ఎందుకు పట్టించుకోరు. ఓ రైలు మార్గం.. ఓ హెరిటేజ్ సిటీ హోదా ఎందుకివ్వరు.
రాజకీయానికి అవకాశం ఉంటేనే దేవుడా..?
అంతా రాముడి పేరు చెప్పి రాజకీయం చేయడమే తప్ప.. ఎక్కడా .. రాముడిని రాముడిగా చూద్దామనే ఆలోచన లేదు. అయోధ్య పేరు చెప్పుకుంటే.. ఓట్లు వస్తాయన్నదే వారి తాపత్రయం. అందుకే అయోధ్య గురించి.. శబరిమల గురించి.. మరో ఆలయం గురించి పట్టించుకుంటారు.. వివాదం చేస్తారు కానీ.. భద్రాద్రి అభివృద్ధి గురించి మాత్రం ఆలోచించరు. ఎందుకంటే..ఇక్కడ ఓట్లు రాలవు కాబట్టి.