నవ్యాంధ్ర రెండో అసెంబ్లీలో.. తొలి సారిగా… ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే.. ప్రసంగంలో… ఎలాంటి కొత్త విషయాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను మాత్రమే ప్రస్తావించి.. అన్నింటినీ అమలు చేయడం తమ లక్ష్యమన్నారు. సాధారణంగా గవర్నర్ ప్రసంగం అంటే.. ప్రభుత్వ లక్ష్యాలు, ఆశయాలు, అభివృద్ధి ఆలోచనల కలగలుపుగా ఉంటుంది. కానీ.. ఈ సారి మాత్రం.. కేవలం.. వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినవాటిని మాత్రమే ప్రస్తావించిన గవర్నర్… వాటిని అమలు చేసి సుపరిపాలన అందిస్తామన్నారు.
మేనిఫెస్టోను చదివేసిన గవర్నర్..!
నవరత్నాల అమలుతో.. పేదల జీవితాలు వెలుగులు నింపుతామని… గవర్నర్ ప్రసంగం ద్వారా.. ప్రభుత్వం… హామీ ఇచ్చింది. రైతులకు ఏటా రూ.12,500, పిల్లల్ని బడికి పంపే తల్లులకు ఏటా రూ. 15,000, సామాజిక పెన్షన్లు .. రూ. మూడు వేల వరకూ పెంచుకుంటూ పోవడం, బీసీ, ఎస్సీ, ఎస్టీల మహిళలకు.. నాలుగు విడతల్లో రూ. 75వేలు, డ్వాక్రా రుణాలను.. నాలుగు విడతల్లో మాఫీ చేయడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ఉచిత బోర్లు, తొమ్మిది గంటల ఉచిత విద్యుత్.. ఇలా … అన్నీ… మేనిఫెస్టోలో ఉన్నవే.. గవర్నర్ మళ్లీ చదివారు. దశలవారీ మద్యనిషేధంలో భాగంగా.. ఇప్పటికే… బెల్టుషాపులను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని గవర్నర్ ప్రకటించారు. గ్రామవాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ చేస్తామన్నారు.
అందరికీ నగదు పంపిణీనే ప్రధాన లక్ష్యం..!
అవినీతి లేకుండా పరిపాలన చేస్తామని.. వందశాతం పారదర్శకత దిశగా సీఎంవో పనిచేస్తుందని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పిస్తాం. నాలుగేళ్లలో 25లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ఏటా జనవరిలో ప్రకటిస్తామని రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటాం. సహకార డెయిరీలకు పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకం ప్రకటించారు. వైఎస్ పాలన తరహాలో అందరికీ ఫలాలు అందుతాయన్నారు.
అభివృద్ధి లక్ష్యాలు.. ఆదాయ పెంపు ప్రణాళికల్లేవా..?
గవర్నర్ ప్రసంగం మొత్తం సంక్షేమ పథకాలు.. ప్రజలకు ఇచ్చే డబ్బుల గురించే ఉన్నాయి కానీ.. రాష్ట్ర భవిష్యత్ కోసం.. కొత్త ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో.. ఒక్క ముక్క కూడా.. గవర్నర్ ప్రసంగంలో లేదు. హామీలు అమలు చేయడానికి నిధుల సేకరణ కోసం ఎం చేయబోతున్నారో చెప్పలేదు. రాజధాని గురించి ఎప్పటి లాగే ఒక్క మాట కూడా లేదు. మొత్తంగా.. సంక్షేమంతో.. ప్రజలకు.. నేరుగా నగదు సాయం చేయడమే.. తమ ముందున్న లక్ష్యమన్నట్లుగా ప్రభుత్వ విధానం… కనిపిస్తోంది కానీ.. అభివృద్ధి పరంగా.. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో మాత్రం… స్పష్టత ఇవ్వలేకపోయారు.