తెలంగాణలో భాజపా ఆపరేషన్ షురూ అయినట్టే! భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. నల్గొండ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశంలో అభివృద్ధి యాత్ర సాగుతోందన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు దూసుకుపోతున్నాయన్నారు. ఈ అభివృద్ధి యాత్రలో తెలంగాణ ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో తెలంగాణ ప్రజలు కలిస్తే… దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ ప్రజలు భాజపావైపు చూస్తున్నారనీ, తమ వెంట వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారు పాలనపై కూడా విమర్శలు గుప్పించారు. కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. వాటిని ప్రజలకు చేరువ చేయడంతో కేసీఆర్ సర్కారు విఫలమైందని విమర్శించారు. తేరేట్ పల్లి ప్రజలతో తాను మాట్లాడాననీ, వారు ఎన్నో సమస్యలు చెప్పారనీ, కనీసం మరుగుదొడ్లు కూడా లేవని వాపోయారంటూ అమిత్ షా చెప్పారు. దాదాపు నాలుగు కోట్ల మరుగుదొడ్లను కేంద్రం కేటాయిస్తే.. తేరేట్ పల్లికి ఒక్కటైనా అందకపోవడం రాష్ట్ర సర్కారు వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించిందన్నారు. దేశంలో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు.
అమిత్ షా వ్యాఖ్యలల్ని జాగ్రత్తగా గమనిస్తే… తెలంగాణ ప్రజలకు వరాలిచ్చారా, లేదా భాజపా అధికారంలోకి రాకపోతే తామేదో కోల్పోతామని తెలంగాణ ప్రజలు భావించేలా చేశారా..? నిజానికి, దేశంలోని అన్ని రాష్ట్రాలనూ కాషాయీకరణ చేసేందుకు భాజపా సిద్ధమైన సంగతి తెలిసిందే. వాటిలో తెలంగాణ, ఆంధ్రాలు కూడా లిస్టులో ఉన్నాయి. అయితే, ఈ కాషాయికరణకు ఇప్పుడు అభివృద్ధి యాత్ర అనే కొత్త మీనింగ్ ఇస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా సరే.. రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలంటే ఇక్కడా తామే అధికారంలోకి రావాలన్నట్టుగా చెబుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే… కేంద్రం అందిస్తున్న పథకాలను ప్రజలకు అందించడంలో రాష్ట్రం ఫెయిల్ అయిందని షా చెప్పడం! ఒకవేళ ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అధికారం ప్రస్తుతం భాజపాకి ఉంది కదా. కేంద్రంలో అధికారంలో ఉన్నది వారే కదా. ఆ అమలు కాని పథకాలేవో ఉంటే.. వాటిని లిస్ట్ అవుట్ చేసి వివరణ ఇవ్వాలంటూ రాష్ట్రాలను అడగమనండీ! అభివృద్ధి జరగాలంటే భాజపాకే ఓటెయ్యాలంటూ ఇప్పట్నుంచీ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టుగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయి. దేశంలో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం కాబట్టి, తెలంగాణలో కూడా ప్రజలు తమకు అధికారం ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మిగతా రాష్ట్రాలను పక్కనపెట్టి.. తెలంగాణకు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేదే ఇక్కడి నిర్ణయాత్మక అంశం అవుతుంది కదా! ఏదైతేనేం, తెలంగాణలో భాజపా ఆపరేషన్ షురూ అయినట్టే. దీనికి ధీటుగా కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుందో వేచి చూడాలి.