ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అమరావతిపై పెట్టే ఖర్చులో పది శాతం వరకూ ఖర్చు చేసి… విశాఖను హైదరాబాద్, బెంగళూరులా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. నిజానికి అమరావతిలో ఖర్చు పెట్టేది మౌలిక సదుపాయాలకే. విశాఖలో అవన్నీ ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఇక పదిశాతం ఖర్చు పెట్టి.. హైదరాబాద్, బెంగళూరులా ఎలా తీర్చిదిద్దుతారో… క్లారిటీగా చెప్పాల్సి ఉంది. అమరావతి ఖర్చు లక్ష కోట్లని లెక్క చెబుతున్న సీఎం.. అందులో పదిశాతం ఖర్చు పెట్టి.. విశాఖను.. బెంగళూరు, హైదరాబాద్గా మారుస్తామంటున్నారు. అయితే.. బెంగళూరు, హైదరాబాద్ అంత పెద్ద నగరాలు అయింది.. ప్రైవేటు పెట్టుబడులతోనే అన్న విషయాన్ని జగన్ విస్మరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ రెండు నగరాల్లో పెద్ద ఎత్తున వచ్చిన ప్రైవేటు పెట్టుబడులతోనే మహానగరాలయ్యాయి.
ప్రజా రాజధానులుగా మారాయి. ఉపాధి కల్పనా భాండాగారాలుగా ఎదిగాయి. చెన్నై, బెంగలూరుల్లో ఐటీ రంగం… దూసుకుపోయింది. అక్కడ ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు లభించే ఉపాధి… కలిగే మేలు.. చాలా స్వల్పమే. ఆ నగరాల నలుమూలలా… మల్టినేషనల్ కంపెనీలు.. తమ కార్యకాలాపాలు ప్రారంభించడంతోనే… అవి పెరిగి పెద్దవయ్యాయి. ఇప్పుడు సీఎం జగన్.. విశాఖలో పరిపాలనా రాజధాని పెట్టి… ఆ స్థాయికి తీసుకెళ్తానని చెబుతున్నారు. విశాఖలో పెట్టుబడులను ఆకర్షించడానికి సీఎం జగన్ … ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. పైగా … ఆదాని డేటా సెంటర్, లూలూ కన్వెన్షన్ సెంటర్ సహా.. అనేక వ్యాపార ప్రతిపాదనల్ని.. డిలీట్ చేసేశారు. ఆ కంపెనీలు వస్తే.. విశాఖ పారిశ్రామిక పరంగా.. ఓ రేంజ్లో ఉండేదన్న అభిప్రాయం ఉంది.
అవి మాత్రమే కాదు.. ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన అనేక ఐటీ కంపెనీలను వెళ్లగొట్టారు. ఇప్పుడు సెక్రటేరియట్ పెట్టాలనుకుంటున్న మిలీనియం టవర్స్ ఉన్న భవనాల్లో ఉన్న ఐటీ కంపెనీలను.. పంపేశారు. కొత్తగా వచ్చే పెట్టుబడులు లేవు. ఇలా చేసి… హైదరాబాద్, బెంగళూరులా.. విశాఖను చేస్తామని.. జగన్ చెప్పుకొస్తూండటం.. చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది..