టీడీపీ గెలిచిన వెంటనే అమరావతికి పూర్వ వైభవం వస్తోంది. అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే అమరావతి ప్రాంతంలో ఐదేళ్లుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేయడం ప్రారంభించారు. దాదాపుగా వంద జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభమయింది.
అమరావతి నిర్మాణం పీక్స్ లో ఉన్నప్పుడు టీడీపీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పనులు ఆపేసి పాడుబెట్టారు. మొదటి విడతలో అమరావతిని ఖరారు చేసి.. భూ సమీకరణ చేసి.. ఎన్జీటీలో పిటిషన్లను అధిగమించి పనులు ప్రారంభించే సరికి చాలా కాలం గడిచిపోయింది. ఈ సారి ఎలాంటి సమస్యలు లేవు. ఆల్రెడీ పడిన పునాదుల మీద నిర్మాణాలు చేయడమే మిగిలింది. అందుకే రెండు, మూడేళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.
ప్రైవేటు సంస్థలు, కేంద్ర సంస్థలకు కూడా పెద్ద ఎత్తున స్థలాలు కేటాయించారు. వారంతా.. వీలైనంత త్వరగా నిర్మాణాలు చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన మద్దతు ఉండే అవకాశం ఉండటంతో రెండు, మూడేళ్లలో అమరావతికి ఓ రూపు వస్తుందని.. అభివృద్ధికి హద్దే ఉండదన్న ఓ నమ్మకం బలపడుతోంది.