తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఖాళీ అయిపోయిన పరిస్థితి. ఇంకా మిగిలి ఉన్న నాయకులు కూడా ఇప్పుడు దారులు వెతుక్కుంటున్న పరిస్థితి. 18న భాజపాలో చేరేందుకు ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలు సిద్ధమైన పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా భాజపా ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే, ఈ క్రమంలో ఇప్పుడు వినిపిస్తున్న మరో కథనం ఏంటంటే… సీనియర్ తెలుగుదేశం నాయకుడు దేవేందర్ గౌడ్ కూడా భాజపాలో చేరాలనే నిర్ణయించుకున్నట్టు సమాచారం.
తెలుగుదేశం పార్టీలో దేవేందర్ గౌడ్ ఒక వెలుగు వెలిగారు. అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తరువాత ఆయనే అన్నట్టుగా చాన్నాళ్లు వ్యవహరించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ఉన్నారు. అయితే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఒక తప్పటడుగు వేసి… రాజకీయాల్లో ప్రాభవం కోల్పోయారు. ఆ సమయంలో టీడీపి వదిలి బయటకి వచ్చేసి, సొంత పార్టీ పెట్టారు. కానీ, అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నాయకులెవ్వరూ చేరకపోవడం, ప్రజల నుంచి కూడా సరైన స్పందన రాకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తరువాత, పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేసి, ఆ పార్టీ నుంచి టిక్కెట్ మీద పోటీ చేసి ఓడిపోయారు. చివరికి తెలుగుదేశం పార్టీలోకే వచ్చి చేరారు. ఆ తరువాత, టీడీపీ నుంచి ఆయన రాజ్యసభకు కూడా వెళ్లారు. అయితే, గత కొన్నాళ్లుగా అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. అయితే, ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి… ఆయన క్రియాశీల పాత్ర పోషిస్తారని చంద్రబాబు భావించారు. కానీ, ఇప్పుడాయన పార్టీని వదిలి వెళ్లేందుకు నిర్ణయించుకున్న పరిస్థితి. దేవేందర్ తోపాటు, ఆయన కుమారుడు కూడా భాజపాలో చేరేందుకు సిద్ధపడ్డారనీ… భాజపాకి చెందిన కొంతమంది నేతలు ఈమేరకు ఇటీవలే కలిసి ఆహ్వానించారనీ సమాచారం. దేవేందర్ గౌడ్ వెళ్లిపోతే తెలంగాణ టీడీపీలో పేరున్న నాయకులంటూ ఎవ్వరూ లేనట్టే అవుతుంది.