ఇది ఫిబ్రవరి రెండవ వారం, 2016 నాటి సంగతి. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 2018 డిసెంబర్ లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చాలెంజ్ విసిరారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి పత్రికలలో ” జగన్, రాసి పెట్టుకో” అన్న సవాలు లాంటి హెడ్డింగ్ తో దేవినేని ఉమా వ్యాఖ్యలు ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెళుతుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ 2018 డిసెంబర్ లోపలే పోలవరాన్ని పూర్తి చేసి చూపిస్తామని, జగన్ కు ఆనాటి ప్రెస్మీట్లో దేవినేని ఉమా చాలెంజ్ విసిరారు. ఈరోజు 2018 డిసెంబర్ నెల ఆఖరి రోజు. మరి ఆరోజు దేవినేని ఉమా విసిరిన చాలెంజ్ ఏమైందో తెలుసుకునే హక్కు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికీ ఉంది.
అయితే తెలుగుదేశం నేతలు పోలవరం పూర్తి కాకపోవడాన్ని ఏదో రకంగా సమర్థించుకోవచ్చు. కేంద్రం నిధులు ఇవ్వలేదని నెపం బిజెపి మీద నెట్టేయవచ్చు. లేదా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇటువంటి సవాళ్లు ప్రతిసవాళ్లు చేసేముందు ఈ విషయాలు తెలియవా అని ప్రజలు అడిగే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ బీజేపీపై నెపం వేద్దామంటే, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టును మీరు ఎందుకు చేపట్టారు, కమీషన్ల కోసమేనా అంటూ విపక్షాలు ప్రశ్నించే ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పవలసి ఉంటుంది.
సాంకేతిక కారణాలో మరొకటో చెప్పి సమర్థించుకోవడం మంత్రివర్యుల కు పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ సవాలు కంటే ముఖ్యం, ప్రజల ఆకాంక్ష మేరకు పోలవరం అయితే పూర్తి కాలేదు అన్న వాస్తవం. 2014లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయానికి కారణం చంద్రబాబు నాయుడు మీద ఆయన కార్యదక్షత మీద ప్రజలకు ఉన్న నమ్మకం. విడిపోయిన తెలంగాణ ప్రజలు అసూయచెందేంతగా ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాబు అభివృద్ధి చేస్తాడు అన్న నమ్మకంతో, కసిగా ఓట్లు వేశారు ప్రజలు తెలుగుదేశం పార్టీకి. అయితే సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన మంత్రులు తాము స్వయంగా విసిరిన సవాళ్ళను కూడా అందుకోలేకపోయారు అన్నది ఇప్పుడు ప్రజల కళ్ళముందు తేటతెల్లమవుతున్న వాస్తవం. మరి దీనికి ప్రజలు ఎలా స్పందిస్తారన్నది తెలియాలంటే 2019 ఎన్నికల వరకు ఆగాల్సిందే.
– జురాన్