చిరంజీవి సినిమా అంటేనే మ్యూజికల్ హిట్. సినిమా ఎలాగున్నా, పాటలు మాత్రం మార్మోగిపోయేవి. కేవలం పాటల కోసమే జనాలు థియేటర్లకు వెళ్లేవారు. చిరుకి మ్యూజిక్ పట్ల మంచి టేస్ట్ ఉంది. అందుకే ఆయన సినిమాలో పాటకు వన్స్ మోర్, విజిల్స్ పడాల్సిందే. అయితే కొన్ని సినిమాలుగా చిరు పాటల్లో ఇది వరకటి మెరుపులు లేవు. సైరాలో ఒక్క పాట కూడా మనకు గుర్తుండదు. ఆచార్యలో లాహే.. లాహె తప్ప మరో పాట జ్ఞప్తికి రాదు. గాడ్ ఫాదర్లో పాటలున్నాయో, లేదో కూడా అర్థం కానట్టుంటుంది వ్యవహారం. ఇప్పుడు భోళా శంకర్ కూడా అంతే. రెండు పాటలొచ్చాయి. రెండూ యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయాయి. పాటల విషయంలో చిరు జడ్జిమెంట్ ఏమైంది అనేది ఆయన అభిమానుల నుంచి వస్తున్న అనుమానం. చిరు పాటలంటే ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా? అని అంతా ఎదురుచూసేవారు.ఇప్పుడు ఆ ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతోంది.
ఇక మీదట తన సినిమాలకు మ్యూజిక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చిరు ఫిక్సయ్యాడట. ఆయన ఈమధ్య దేవిని మిస్ అవుతున్నాడు. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెం.150కి దేవీనే సంగీతం అందించాడు. మ్యూజికల్ పరంగా ఆ సినిమా హిట్టు. అమ్మడూ.. పాటైతే చిరు అభిమానులకు నచ్చేలా డిజైన్ చేశాడు దేవి. వాల్తేరు వీరయ్యలోనూ పాటలు మాస్కి నచ్చేలా ఉంటాయి. అందుకే తన తదుపరి సినిమాకు దేవిని ఎంచుకొన్నాడు చిరు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు సినిమా ఒకటి ఖరారైంది. ఈ చిత్రానికి దేవిని సంగీత దర్శకుడిగా ఎంచుకొన్నారు. చిరు – వశిష్టల చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కీరవాణి మంచి ఫామ్లో ఉన్నాడు. పైగా చిరుతో పని చేసి చాలా కాలమైంది. అందుకే కీరవాణిని రంగంలోకి దింపాడు చిరు.