సినిమాలో కనీసం ఓ సూపర్ హిట్ సాంగ్ ఉండాలని కోరుకొంటారు దర్శక నిర్మాతలు. కొన్నిసార్లు ఆ పాటే… సినిమా పాలిట సంజీవనిగా మారుతుంది. ఓ పాట ట్రెండింగ్‌లోకి వస్తే చాలు. సినిమా వైపు ప్రేక్షకుల చూపు పడిపోతుంది. సంగీత దర్శకుడు సక్సెస్ అయిపోయినట్టే. కాకపోతే ఏ పాట ట్రెండింగ్‌లోకి వెళ్తుందో, ఏ పాట ట్రోల్ అవుతుందో చెప్పడం మహా కష్టం. ఓ సినిమాలో అన్ని పాటలూ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోతే.. పాట తరవాత పాట – జనంలోకి దూసుకుపోతే. ఆ సినిమాని అదృష్టం గట్టిగా పట్టేసుకొన్నట్టే. ‘పుష్ష 2’ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.
సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబో అంటే ఆ క్రేజే వేరు. ఇద్దరూ కలిసి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ‘పుష్ప 1’లో పాటలన్నీ హిట్టే. ‘రంగస్థలం’ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమధ్య దేవిశ్రీ ప్రసాద్ పెద్దగా ఫామ్ లో లేడు. అతన్నుంచి అద్భుతమైన అవుట్ పుట్ ఏం బయటకు రాలేదు. మరి ‘పుష్ప 2’ కోసం ఎలాంటి పాటలు ఇస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే సుక్కుతో సినిమా అనగానే తన సత్తా మొత్తం బయటపెట్టేశాడు దేవిశ్రీ. ‘పుష్ప 2’లో ఇప్పటి వరకూ వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్టే. వచ్చిన ప్రతీ పాటా.. ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. పుష్ప రాజ్ క్యారెక్టర్ని ఆవిష్కరించిన టైటిల్ సాంగ్, పుష్ప పై శ్రీవల్లీకి ఉన్న ప్రేమని బయటపెట్టిన రొమాంటిక్ గీతం, ఓ సామాజిక బాధ్యతతో కూడిన ఐటెమ్ సాంగ్, ఇప్పుడు ఫీలింగ్స్ పాట… ఇలా ఏది చెప్పుకొన్నా – టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయాయి. పాట బయటకు రావడం, సామాజిక మాధ్యమాలలో వైరల్ అవ్వడం, యూ ట్యూబ్ లో కొత్త రికార్డులకు వేదిక అవ్వడం… రొటీన్ వ్యవహారాలుగా మారిపోయాయి.
ముఖ్యంగా పీలింగ్స్ పాట మాస్‌కి తెగ నచ్చేసింది. ఇందులోని ప్రతీ బీటూ, ప్రతి స్టెప్పూ, ప్రతీ పదం ఇనిస్టెంట్ గా ఎక్కేశాయి. ఇది నూటికి నూరుశాతం దేవిశ్రీ ప్రసాద్ సృష్టించిన మ్యాజిక్కే. దేవికి మాస్ పల్స్ బాగా తెలుసు. సుక్కు, బన్నీలకు ఏం కావాలో అంతకంటే బాగా తెలుసు. అందుకే యధావిధిగా రెచ్చిపోయి మ్యూజిక్ చేశాడు. తన కంపోజీషన్పై ఎవరికైనా, ఏమైనా అసంతృప్తులు ఉంటే.. ఈ ఆల్బమ్ తో ఎగిరిపోయేలా చేశాడు. సౌత్ ఇండియాలో తన మ్యూజిక్‌కి ఎంత దమ్ముందో.. పాటలరా నిరూపించేశాడు.
మైత్రీ మూవీస్‌కీ, దేవిశ్రీ ప్రసాద్ కూ మధ్య కొన్ని అలకలూ, కొన్ని లుకలుకలూ ఉన్నాయి. చెన్నై ఈవెంట్ లో ఇది బయటకు వచ్చేసింది. దేవిశ్రీతో మైత్రీ మూవీస్ పని చేయడం ఇదే ఫైనల్ అంటూ వార్తలు బయల్దేరాయి. ఆర్.ఆర్ విషయంలో జరిగిన గందరగోళంతో, టైటిల్ క్రెడిట్ విషయంలో దేవిశ్రీ చాలా హర్టయ్యాడని ఇక మీదట మైత్రీ మూవీస్ ని దేవి కూడా దూరం పెడతాడని చెప్పుకొన్నారు. ఈ ఆల్బమ్… దానికి వస్తున్న క్రేజ్.. ఇవన్నీ చూస్తుంటే మైత్రీనే కాదు, ఏ నిర్మాణ సంస్థ కూడా దేవిశ్రీ ప్రసాద్ ని వదులుకొనే ధైర్యం చేయదనిపిస్తోంది. చిత్రపరిశ్రమలో టాలెంట్ ఒక్కటే మాట్లాడుతుంది. మిగిలినవన్నీ పక్కకు వెళ్లిపోతాయి. `లెజెండ్` సమయంలో బోయపాటి మనస్సు చివుక్కుమనేలా దేవి మాట్లాడి ఉండొచ్చు. కానీ అది ఆ సందర్భానికే పరిమితం. బోయపాటి దేవిని పక్కన పెట్టలేకపోయాడు. ఇప్పుడు మైత్రీ కూడా అంతే! సుకుమార్ ప్రాజెక్టులన్నీ మైత్రీతో ముడి పడి ఉన్నవే. త్వరలో రామ్ చరణ్‌తో సుక్కు ఓ సినిమా చేయాలి. అప్పుడు దేవి లేకుండా సక్కు సినిమా తీస్తాడా? అందునా ‘పుష్ప 2’ పాటలకు వచ్చిన మైలేజ్ చూశాక దేవిని పక్కన పెట్టగలడా? ఇక్కడ ఎన్ని గొడవలున్నా సర్దుకుంటాయి. ఎన్ని లుకలుకలున్నా అవన్నీ పక్కకెళ్లిపోతాయి. ఆ మ్యాజిక్… ఆ మహిమ.. ‘సినిమా’కే ఉంది.