పుష్ప 2 విషయంలో దేవిశ్రీ ప్రసాద్ కీ మైత్రీ మూవీస్‌కీ మధ్య ఏవో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఈ విషయం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని రంగంలోకి దింపినప్పుడే అర్థమైపోయింది. సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్‌లది విడదీయలేని అనుబంధం. దేవి లేకపోతే సినిమా చేయలేను.. అని సుకుమారే చాలా సార్లు వేదికపై చెప్పుకొచ్చాడు. పుష్ప విజయంలో దేవిశ్రీది కీలక పాత్ర. అలాంటిది పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవిని పక్కన పెట్టి తమన్, అజనీష్ లోక్ నాథ్ శ్యామ్ లను రంగంలోకి దింపింది మైత్రీ. దేవిశ్రీ ప్రసాద్ సమయానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని, అందువల్ల మరో ముగ్గుర్ని తీసుకోవాల్సివచ్చిందని చిత్రబృందం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే తాను చేయాల్సిన పని మరొకరికి అప్పగించడం దేవికి నచ్చలేదు. సుకుమార్ కూడా నిర్మాతల్ని కాదనలేకపోయాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతల్ని భాగాలుగా పంచి, మరో ముగ్గురికి అప్పగించినా, దేవిశ్రీ తన వంతుగా సినిమాకు ఆర్.ఆర్ ఇచ్చుకొంటూ వెళ్లాడని, దేవిశ్రీ ఇచ్చిన వెర్షనే ఫైనల్ కాపీలో వినే అవకాశం ఉందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే… దేవిశ్రీకి మైత్రీ మూవీస్ పై ఉన్న అసహనం మాత్రం తగ్గలేదు. అది చెన్నైలో జరిగిన ఈవెంట్ లో ప్రస్పుటంగా కనిపించింది.
దేవిశ్రీ ఈ ఫంక్షన్ కి కాస్త లేట్ గా వచ్చారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ దేవిని అడిగారు కూడా. దానికి దేవి కాస్త ఫీలైనట్టు కనిపించింది. వేదికపైనే తన అసహనాన్ని నవ్వుతూ బయటపెట్టేశాడు. పాటలు లేటని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేటని తనని అంటూనే ఉంటారని, ఇప్పుడు కూడా ఫంక్షన్‌కి లేట్ గా వచ్చానని ఫీలయ్యారని, ఈ విషయంలో తననేం చేయమంటారని… నవ్వుతూనే చురకలు అంటించాడు. లేట్ అవ్వడానికి కారణాలు సైతం చెప్పాడు. అంతేకాదు.. ఎవరూ క్రెడిట్ ఇవ్వరని, తీసుకోల్సిందేనని, అది పేమెంట్ అయినా, స్క్రీన్ పైన క్రెడిట్ అయినా తప్పదని కామెంట్ చేశాడు దేవి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో క్రెడిట్ తనతో పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులకు పంచడం దేవికి ఇష్టం లేదని, అందుకే ఇలాంటి కామెంట్లు చేశాడన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మైత్రీ మూవీస్ నిర్మాతలకూ, దేవిశ్రీకీ మధ్య అనుబంధం ఇదివరకు ఉన్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడు లేదన్నది నిజం. వాళ్ల మధ్య ఏదో జరిగింది. అదేమిటో తెలియాలంటే.. వీళ్లలో ఎవరో ఒకరు బయట పడాల్సిందే.