ఆగస్టు 15న రావాల్సిన ‘పుష్ష 2’ డిసెంబరుకు వెళ్లిపోయింది. డిసెంబరు నాటికైనా ఈ సినిమా వస్తుందా? రాదా? అనేది కొంతమంది అనుమానం. కానీ ఈసారి డేట్ విషయంలో తగ్గేదే లేదంటోంది పుష్ష టీమ్. కానీ అనుకొన్న సమయానికి ఈ సినిమా బయటకు రావడం దేవిశ్రీ ప్రసాద్ చేతుల్లోనే ఉంది.
‘పుష్ష 2’కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. పాటల విషయంలో దేవి చాలా స్పీడు. కానీ ఆర్.ఆర్కు మాత్రం సమయం తీసుకొంటాడు. పుష్ష లాంటి క్రేజీ సినిమాల విషయంలో తాను మరింత ఎఫర్ట్ పెట్టాలి. అందుకే తనకు ఎట్టిపరిస్థితుల్లో రెండు నెలల ముందు ఫుటేజీ ఇవ్వాల్సిందే అని దేవిశ్రీ ప్రసాద్ చెబుతున్నాడట. అంటే.. సెప్టెంబరు నెలాఖరుకు సినిమా మొత్తం పూర్తవ్వాలి. అప్పుడు సరిగ్గా దేవి చేతిలో రెండు నెలల సమయం ఉంటుంది. ఆర్.ఆర్ ఇవ్వడానికి ఈ మాత్రం సమయం కావాలి కూడా. అయితే సుకుమార్ ఆ టైమ్ లో అవుట్ పుట్ ఇవ్వగలడా? లేదా? అనే డౌటు ఉంది. సుకుమార్ కేవలం 40 రోజుల ముందే అవుట్ పుట్ ఇస్తానని దేవికి చెబుతున్నాడట. ఆ 40 రోజుల్లో ఆర్.ఆర్ పూర్తి చేయడం కత్తి మీద సామే. కొంతమంది సంగీత దర్శకులు సినిమాకు ముక్కలు ముక్కలుగా ఆర్.ఆర్ ఇస్తుంటారు. ఏ సీన్ అయితే ఆ సీన్ కి… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టేస్తారు. కానీ దేవి ఆ టైపు కాదు. సినిమా మొత్తం ఒకే ఫ్లో లో ఉండాలని కోరుకొనే వ్యక్తి. మొత్తం సినిమా తన చేతుల్లో ఉంటే గానీ, ఆర్.ఆర్. ఇవ్వడు. ఈ విషయం సుకుమార్‌కీ తెలుసు. కాకపోతే దేవి రెండు నెలల్లో చేయాల్సిన పనిని ఇప్పుడు 40 రోజుల్లో పూర్తి చేయాలి. అలా ఒత్తిడంతా సుకుమార్ నుంచి దేవిశ్రీ ప్రసాద్‌కు షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.