కల్యాణ్ రామ్ ‘డెవిల్’ 29న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఓ హత్య కేసు పరిశోధనతో కథను ప్రారంభించి.. ఆ తర్వాత చరిత్ర, బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు.. ఇలా అనేక కీలక అంశాల్ని చూపిస్తూ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ బ్రిటిష్ గూఢచారిగా కల్యాణ్ రామ్ కనిపించిన తీరు.. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత డెవిల్ కి హిందీ చిత్రం ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి’ తో పోలిక తెరపైకి వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కథానాయకుడిగా దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2015 లో విడుదలైయింది. బెంగాలీ రచయిత శరదిందు బంద్యోపాధ్యాయ ఫిక్షనల్ డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి రచనలు ఆధారంగా ఈ సినిమాని తీశారు. బాక్సాఫీసు వద్ద అంత ప్రభావాన్ని చూపించలేదు కానీ సినిమాని లోతుగా అర్ధం చేసుకొని ఇష్టపడేవారు ఈ సినిమాకి క్లాసిక్ అనే కితాబులు ఇస్తుంటారు.
ఇప్పుడదే పాయింట్ తో డెవిల్ తీశారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్, పంచెకట్టు, రెండు లేడి పాత్రలు, ఒక మర్డర్ కేసు, సీక్రెట్ ఏజెంట్.. ఇలా కొన్ని రిఫరెన్స్ లు కనిపించాయి ట్రైలర్ లో. అయితే ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి’ లో బర్మా, చైనీస్ టచ్ వుంటుంది. పైగా అందులో పెద్దగా యాక్షన్ లేదు. కానీ డెవిల్ మాత్రం బ్రిటిష్, తిరుగుబాటు..ఎలివేషన్స్.. ఇలా చాలా ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి.
అయితే అభిషేక్ నామాకి బెంగాలి కంటెంట్ అంటే ఇష్టం. రవితేజ రావణాసుర కూడా ఓ బెంగాలి సినిమాకి రీమేక్. డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి తరహలో శరదిందు బంద్యోపాధ్యాయ చాలా కథలు రాశారు. అందులో నుంచి ఎదో ఒక కథ తీసుకొని ఉండొచ్చు, లేదా డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి కథనే పూర్తిగా మార్చి కొత్తగా చూపించే ప్రయత్నం చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఇప్పటివరకూ టీం మాత్రం దీనిపై ఎలాంటి విషయం చెప్పలేదు. రావణాసుర విషయంలో కూడా ఇలానే జరిగింది. సినిమా విడుదలైనంత వరకూ అది రిమేక్ అని చెప్పలేదు. మరి డెవిల్ సంగతి ఏమిటనేది 29న తెలుస్తుంది.