గొల్లపూడిలోని ఇంటికి వచ్చి కొడతానని దేవినేని ఉమను హెచ్చరించిన మంత్రి కొడాలి నాని.. తాను గొల్లపూడి సెంటర్లో రోజంతా ఉంటానని వచ్చి టచ్ చేయాలని సవాల్ చేశారు. దాని ప్రకారం.. దేవినేని ఉమ ఉదయం ఇంటి నుంచి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లారు. అయితే.. వందల మంది పోలీసులు అప్పటికే గొల్లపూడిని చుట్టుముట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లకుండా.. అడ్డుకున్నారు. దీక్షకు అనుమతి లేదంటూ ఆయనను అరెస్ట్ చేసి పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిపోయారు. దీంతో గొల్లపూడి సెంటర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మీడియా కూడా… ఉమ వర్సెస్ నాని సవాళ్లను హైలెట్ చేయడంతో ప్రజల్లోనూ ఉత్కంఠ ప్రారంభమయింది.
దేవినేని ఉమను కొడతానన్న కొడాలి నాని వస్తారేమోనని అందరూ ఎదురు చూశారు. అయితే అనూహ్యంగా వల్లభనేని వంశీ కొంత మంది అనుచరులతో అక్కడికి వచ్చారు. గొల్లపూడిలో ఆగి మీడియాతో మాట్లాడారు. దేవినేని ఉమను కొడాలి నాని .. టీవీ చానల్లో చర్చకు రమ్మన్నారు కానీ.. ఇలా రోడ్డు మీద కాదని కవర్ చేశారు. టచ్ చేసి చూడు అనేది కొడాలి నాని, తన టైటిల్ అని.. దాన్ని కూడా దేవినేని ఉమ కాపీ కొట్టారని ఆరోపించారు. రోడ్డు మీద రచ్చ చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని … టీవీ చానల్ స్టూడియోలో చర్చించుకుదామని.. తాను.. కొడాలి నానీ వస్తామని సవాల్ చేశారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు.
అయితే కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలను అదే పనిగా ప్రచారం చేస్తూ.. దేవినేని ఉమ వర్గాన్ని రెచ్చగొట్టిన మెరుగైన చానల్లో మళ్లీ వైసీపీ నేతలందరితో జుగల్బందీ నిర్వహించింది.గొల్లపూడి నుంచి వెనక్కి వచ్చేసిన వల్లభనేని .. మైలవరం వైసీపీ ఆఫీసుకు చేరుకున్నారు. అక్కడ అప్పటికే… ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సహా.. కొంత మంది రిజర్వుడు నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా రెడీ చేసి పెట్టారు. వారందరి మళ్లీ టీడీపీ నేతలకు సవాళ్లు చేయించారు. ఆ సవాళ్ల సారాంశం ఏమిటంటే.. టీవీలో చర్చకు కూర్చోవాలని.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ నేతల తీరు వివాదాస్పమవుతోంది. ఇంటికొచ్చి కొడతానని సవాల్ చేయడం ఏమిటని చర్చ సామాన్యుల్లో వస్తోంది. రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనీయకుండా ఏదో ఓ రచ్చ పెట్టి… ప్రభుత్వాలు.. మంత్రులే.. ఇంత దారుణంగా ప్రజా జీవితాన్ని ఇబ్బంది పెట్టడం ఏమిటన్నది వారి మాట. ప్రతిపక్ష నేతల్ని కొట్టడం.. తన్నడం.. కేసులు పెట్టడం.. తిట్టడం.. ఇదేనా అధికార పార్టీ నేతల విధి అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ నేతలు ఎవరు చెప్పినా వినరు మరి..!