పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డాడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఇది వరకూ అనేక సార్లు ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ పై తెలుగుదేశం వాళ్లు తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్ ను రాయలసీమ ద్రోహిగా అభివర్ణించారు. అందుకు ప్రధాన కారణం.. ఈ ప్రాజెక్టు అవినీతి మయం.. ఈ ప్రాజెక్టు వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా.. ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులతో కాలయాపన, ధనవృథా చేస్తున్నారు.. అంటూ జగన్ విమర్శలు చేయడమే.
పట్టిసీమ నిర్మాణాన్ని కేవలం వైకాపానే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించింది. ఒక దశలో బీజేపీ నేతలు కూడా ఈ ప్రాజెక్టు ఎందుకు? అని ప్రశ్నించారు! అయితే పట్టిసీమ విషయంలో బాబు ఎవరి మాటాకూ విలువనివ్వలేదు. తన పని తాను చేసుకుపోయాడు. ఇప్పటికే పట్టిసీమ ప్రారంభమైందని ప్రకటించారు కూడా. తాజాగా మరోసారి దేవినేని ఉమ జగన్ పై విరుచుకుపడ్డాడు. పట్టిసీమను జగన్ వట్టిసీమ అంటున్నాడని.. ఉమ ధ్వజమెత్తాడు. ఈ ప్రాజెక్టుపై చెడు ప్రచారాన్ని చేస్తున్నాడని.. పంట పొలాలకు నీళ్లు ఇవ్వడం జగన్ కు ఇష్టం లేదని దేవినేని తీవ్రస్థాయి విమర్శలు చేశాడు.
అయినా… ఇప్పటికే పట్టిసీమ ప్రారంభం అయిపోయిందని అంటున్నారు. నీటికి పూజలు చేసి గోదావరిని కృష్ణాకు అనుసంధానం చేశామని కూడా ప్రకటించేశారు! మరి ఇదే జరిగితే.. రైతులకు ఫలాలు అందుతాయి. జనాలకు పట్టిసీమ ప్రాధాన్యత అర్థం అవుతుంది! పట్టిసీమతో నిజంగా ఫలాలు అందే.. రైతులంతా తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా మారిపోతారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును దేవుడిలా చూస్తారు. అలాంటప్పుడు జగన్ అనే వ్యక్తి టీడీపీకి ఏ మాత్రం సమస్యే కాదు! ఎప్పుడో ప్రారంభం అవుతుందని కాదు.. ఇప్పటికే పట్టిసీమ ఆరంభమైపోయింది కదా.. ఇక జనాల అభిప్రాయానికే ప్రాధాన్యతను ఇవ్వాలి తెలుగుదేశం. జనాలే ఈ ప్రాజెక్టుతో ఆనందంగా ఉంటే, జగన్ ప్రచారాన్ని వాళ్లెలా నమ్ముతారు?