సిగ్గులేదు, ఆత్మాభిమానం లేదు, రాక్షసులు, ఉన్మాదులు, ఉగ్రవాదులకంటే దారుణం, బిన్ లాడెన్ కంటే ప్రమాదకరం, అవినీతి సామ్రాట్టులు, అట్టే మాట్లాడితే అసలు మనుషులే కాదు…..ఇవన్నీ మన నేతాశ్రీలందరూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉండే తిట్లు. ఇంతవరకూ ఈ మాటలను కండించిన సాధారణ ప్రజలు మాత్రం ఎవరూ లేరు. కొన్ని రాజకీయ సంఘటనలను చూస్తూ ఉంటే మాత్రం రాజకీయ నాయకులకు మామూలు మనుషులకు ఉండే ఫీలింగ్స్ ఏవీ ఉండవేమో అని అనిపిస్తూ ఉంటుంది. అథికారం తప్ప ఇంకేమీ అవసరం లేదా అన్న అనుమానం వస్తూ ఉంటుంది. ఆ మధ్య ఉప ఎన్నికల సమయంలో ‘పెద్దాయన..పెద్దాయన’ అని ఓ పాపులర్ పాటతో ఓట్ల పండించుకున్నాడు జగన్. ఆ పాటలో వచ్చే విజువల్స్‌లో బొత్స సత్యనారాయణ కూడా ప్రముఖంగా కనిపిస్తారు. వైఎస్ ప్రోత్సాహంతోనే ఆర్థికంగా, రాజకీయంగా బలపడిన బొత్స సత్యనారాయణ…వైఎస్ చనిపోయాక మాత్రం చాలా మాటలు అనేశాడు. వైఎస్ విజయమ్మను కూడా అనరాని మాటలు అన్నాడు. అలాంటి బొత్సను ‘పెద్దాయన…పెద్దాయన’ సాంగ్‌లో చూపించారు కాబట్టే సానుభూతి పెల్లుబికింది. కట్ చేస్తే ఇప్పుడదే బొత్స సత్యనారాయణ లోటస్ పాండ్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. వైఎస్సార్ పార్టీలో ప్రముఖ నేత.
ఇక ఈ రోజు దేవినేని నెహ్రూవారు చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారు అమ్మను గురించి, చంద్రబాబు పుట్టుక గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు చంద్రబాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక్కడ రాయడానికి మామూలు మనుషులకు ఉండే కొన్ని ఫీలింగ్స్ అడ్డొస్తున్నాయి కానీ… ఇదే దేవినేని నెహ్రూగారు చంద్రబాబుగారి గురించి మాట్లాడుతూ…. అమ్మను మెన్షన్ చేస్తూ వీధుల్లో తిట్టుకునే అమానవీయ మాటను వాడేశారు. అది కూడా చంద్రబాబు భక్తుడు ఆంధ్రజ్యోెతి ఎండి రాధాకృష్ణగారి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె కార్యక్రమంలో. ఇప్పటికీ ఆ వీడియో యూట్యూబ్‌లో ఉంది. ఆ తర్వాత కూడా చంద్రబాబును దేవినేని నెహ్రూ తిట్టినన్ని తిట్లు ఎన్టీఆర్ కూడా తిట్టి ఉండరేమో. కానీ ఆ తిట్లన్నింటినీ చంద్రబాబు మర్చిపోయారు. దేవినేని కూడా మర్చిపోయారు. ప్రాణాలిచ్చేస్తానన్నారు, నేను చనిపోయాక పార్థివ దేహంపైన టిడిపి జెండానే ఉండాలని చెప్పారు, పార్టీ వీడినప్పుడు కన్నీళ్ళు పెట్టుకుని గుక్కపట్టి బేర్‌మని ఏడ్చానన్న రేంజ్లో చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబుని పొగిడిన విధానమైతే వర్ణించడానికి మాటలు చాలవు. అలాగే వారసుడు కూడా లోకేష్‌ని ఓ రేంజ్లో మోసేశాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు యూట్యూబ్‌లో ఉంది. అస్తమానూ టెక్నాలజీ గురించి మాట్లాడే చంద్రబాబుకు యూట్యూబ్‌లో ఉండే పాత వీడియోస్ కనిపించవేమో కదా. సరే.. ఆయనకంటే వయసు అయిపోయింది. కానీ యువరక్తంతో ఉరకలెత్తుతున్న యువనేత లోకేష్‌బాబు ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్గానే ఉంటారుగా. కనీసం ఆయనకు అయినా యూట్యూబ్‌లో తన తండ్రి చంద్రబాబుని… దేవినేని నెహ్రూగారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పాత వీడియోలు కనిపించవా?
బహుశా మన రాజకీయ నాయకులకు, వాళ్ళ పిల్లలకు ఇవన్నీ చాలా కామన్‌గా అనిపిస్తూ ఉంటాయేమో. మామూలు మనుషులకు ఉండే ఫీలింగ్స్ ఏవీ వాళ్ళకు ఉండవనుకుంటా. మరి అలాంటప్పడు అదే వేదికపై నుంచి పౌరుషం గురించి మాట్లాడడం ఎందుకు? అలాగే జగన్ తిట్టిన తిట్ల గురించి బాధపడుతున్నాను. భరిస్తున్నాను అని చెప్పడమెందుకు? దేవినేని నెహ్రూ తిట్టిన తిట్లతో పోల్చుకుంటే జగన్ తిట్టిన తిట్లు ఏపాటి?