తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న భద్రాచలంలో శ్రీరామ నవమి ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చినపుడు తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని విధాల సహకరించేందుకు సిద్దంగా ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జలవనరులను పంచుకొందామని, గొడవలు పడితే రెండు రాష్ట్రాల ప్రజలు నష్ట పోతారని చెప్పారు. ఒకప్పుడు కేసీఆర్ నోరు తెరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిప్పులు కురిపించేవారు. అదే కేసీఆర్ ఇప్పుడు సహకరించుకొందామని చెపుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన చేస్తున్న ఈ కొత్త ప్రతిపాదనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదు. కానీ ఖమ్మం జిల్లాలో ముంపు గ్రామాల గురించి ఆయన చేసిన ప్రతిపాదనపై మంత్రి దేవినేని చాలా ఘాటుగా బదులిచ్చారు.
ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురయ్యే కొన్ని గ్రామాలను వెనక్కి తీసుకొనేందుకు తను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతానని, ప్రధానితో కూడా మాట్లాడి వాటిని మళ్ళీ తెలంగాణా రాష్ట్రంలో కలపవలసిందిగా కోరుతానని కేసీఆర్ నిన్న చెప్పారు.
దానికి మంత్రి దేవినేని బదులిస్తూ “ముంపు గ్రామాలను తెలంగాణాకి బదిలీ చేసే ఆలోచన కానీ, అటువంటి ప్రయత్నాలు గానీ మేము చేయడం లేదు. ఎగువ రాష్ట్రాలయిన కర్నాటక, మహారాష్ట్రాలు అక్రమంగా భారీ ప్రాజెక్టులు నిర్మించడం వలన దిగువనున్న ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల అవసరాలకు తగినన్ని నీళ్ళు రావడం లేదు. లేని, రాని నీళ్ళని వాడుకోవడానికి ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా తెలంగాణా ప్రభుత్వం కూడా ప్రాజెక్టులు కట్టడానికి సిద్దమవుతోంది. దాని వలన దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ కొద్ది పాటి నీళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం 812 టీ.ఎం.సీ.ల నీళ్ళు రావాలసి ఉండగా ఎగువ రాష్ట్రాలు అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టుల వలన ఈ ఏడాది కేవలం 66 టీ.ఎం.సీ.ల నీళ్ళు మాత్రమే క్రిందకు వచ్చేయి. వాటినే రెండు రాష్ట్రాలు పంచుకోవలసి వచ్చింది. ఇందుకు కారణమయిన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో పోరాడి మన వాటా నీళ్ళను సాధించుకొనేందుకు తెలంగాణా ప్రభుత్వం కలిసి వస్తే బాగుంటుంది. కానీ అది కూడా వెయ్యి కోట్లు ఖర్చుతో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది,” అని దేవినేని ఉమా మహేశ్వర రావు విమర్శించారు.
దేవినేని వాదన సహేతుకంగానే ఉన్నప్పటికీ ఆయన నోట ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడే మాటలు వినిపించడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సహకరించుకొందాము రా..అని పిలుస్తుంటే కేసీఆర్ చ్చీ కొట్టేవారు. ఇప్పుడు కేసీఆర్ పిలుస్తుంటే దేవినేని చ్చీ కొడుతున్నారు.