‘వంగవీటి’ పేరుతో రాంగోపాల్ వర్మ తీసిన ఓ సినిమా ఇప్పుడు వివాదాల్లో నిండా మునిగింది. తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని వంగవీటి అభిమానులు వర్మపై కౌంటర్లు వేస్తుంటే, వర్మ దానికి ధీటుగానే స్పందిస్తున్నాడు. వర్మ వర్సెస్ వంగవీటి ఫ్యాన్స్ మాటల యుద్ధం.. ‘వంగవీటి’ సినిమా కంటే మజాగా కొనసాగుతోంది. ఆ జ్వాల చల్లారకముందే ఇప్పుడు మరో ట్విస్ట్ వచ్చింది. ఫిల్మ్ ఛాంబర్లో తాజాగా ‘దేవినేని’ అనే కొత్త టైటిల్ రిజిస్టర్ అయ్యింది. ఈ టైటిల్‌కి ‘రెండు కుటుంబాల కథ’ అనే ట్యాగ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. ‘వంగవీటి’ కథలో వంగవీటిని నెగిటీవ్ చేసి చూపించినట్టు.. ‘దేవినేని’ కథలో దేవినేనిని తగ్గించి చూపించే ప్రయత్నాలేమైనా సాగుతున్నాయా? అనే అనుమానం వేస్తోంది.
ఈ టైటిల్, క్యాప్షన్ చూసినవాళ్లెవరికైనా ఇది కూడా విజయవాడ రాజకీయాల చుట్టూ నడిచే కథే అనిపిస్తోంది. సో… మరోసారి విజయవాడ పొలిటికల్ గ్యాంగ్ ఎలెర్ట్ అయిపోయే అవకాశాలు మెండుగు కనిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ ఎవరు రిజిస్టర్ చేయించారు, వాళ్లకీ వంగవీటి వర్గానికీ ఏమైనా సంబంధం ఉందా, లేదంటే… కేవలం `వంగవీటి` పేరు వాడుకొని వర్మ సంచలనం కోసం ప్రయత్నించినట్టు, దేవినేని పేరుని కూడా అలానే వాడుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అనేది చర్చనీయాంశమైంది. ఏదేమైనా ఇలాంటి టైటిళ్లు ఓకే చేసేటప్పుడు ఫిల్మ్‌ఛాంబర్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ టైటిల్ చుట్టూ వివాదాలు సృష్టించే అవకాశాలుంటే.. అలాంటి టైటిళ్ల విషయంలో ఛాంబర్ కాస్త మొండిగా వ్యవహరించడం బెటరేమో..?