మునిగిపోతున్న ఏపీ ప్రభుత్వాన్ని కాపాడటానికి దేశంలో ధర్మాడి సత్యంలు ఎవరూ లేరని.. మాజీ మంత్రి దేవినేని ఉమ సెటైర్ వేశారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు పక్క చూపులు చూస్తుంటే… ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు కొత్త సీఎం ఎవరని చూస్తున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి విషయంలో సీబీఐ దూకుడుగా ఉందని.. ఆయన పాలనా తీరుపై… బీజేపీ కూడా అసహనంతో ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలపై దేవినేని ఉమ.. నర్మగర్భంగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం.. రోజుకో మాట చెబుతోంది. ఇప్పుడు ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా లేదన్న వాదన ఢిల్లీ నుంచి వినిపిస్తోంది. విడుదల చేసిన రూ. 1850 కోట్లు రావాలంటే.. ఏపీ సర్కార్ నియమించిన విజిలెన్స్ విచారణ నివేదిక కావాలని కేంద్రం అడుగుతోంది.
అక్రమాలు జరిగాయని నివేదిక వస్తే.. నిధులు నిలిపివేసి.. ఎంత మేర అక్రమాలు జరిగాయో.. అంత మేర తగ్గించి ఇస్తారు. అక్రమాలేమీ జరగలేదని.. నివేదిక ఇస్తే.. ఏపీ సర్కార్ మెడకు చుట్టుకుంటుంది. ఈ విషయాన్ని దేవినేని ఉమ… ప్రస్తావించి.. పోలవరం ప్రాజెక్ట్ ను కోల్డ్ స్టోరేజీలో పెట్టాలని మండిపడ్డారు. అసమర్థ ప్రభుత్వం కారణంగా పోలవరం పనులు ఆగిపోయాయని.. మంత్రి పత్తా లేడు..సీఎం సమాధానం చెప్పడం లేదని విమర్శలు గుప్పించారు. టీడీపీపై బురద జల్లాలని జరుగుతున్న పనులు ఆపేసి తప్పుడు రిపోర్టు ఇచ్చారు.. ఇప్పుడా రిపోర్టే…ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోందన్నారు.
నవంబర్ ఒకటో తేదీన పోలవరం ప్రాజెక్ట్ కు మేఘా కంపెనీ కొబ్బరి కాయ కొట్టిన పనులు మాత్రం జరగడం లేదు. ఈ లోపు నవయుగ కూడా డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. ఓ వైపు కోర్టు కేసులు..మరో వైపు.. జగన్మోహన్ రెడ్డి రివర్స్ విధానంతో పోలవరం.. చుట్టూ ఎన్నో చిక్కుముళ్లు పడ్డాయి. వాటిని ఇప్పుడల్లా పరిష్కరించడం అంత సాధ్యమయ్యే విషయం కాదనేది జలవనరుల నిపుణుల అంచనా.