ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా పోలవరం ప్రాజెక్ట్ మీదే చర్చ నడుస్తోంది. అటు అధికార పక్షం, ఇటు విఫక్షం, మిత్రపక్షం… అని తేడా లేకుండా అన్ని పక్షాలూ ఏకపక్షంగా పోలవరమే ప్రధానంగా చర్చలు, విలేకరుల సమావేశాలు జరుపుతున్నాయి.ఈ నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు సోమవారం పోలవరాన్ని సందర్శించారు. స్పిల్ వే సహా అన్ని పనులు జరుగుతున్న తీరునూ పరిశీలించారు. అక్కడి ఇంజనీర్లను పనుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్ష నేత వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. ఆయన పాదయాత్ర చేస్తూ పచ్చని పొలాల్లో విషం జల్లుతున్నారన్నారు. తన తండ్రి హయంలో తమ నియోజకవర్గమైన పులవెందులకు కూడా నీళ్లు ఇప్పించుకోలేకపోయిన వైఎస్ జగన్… పోలవరం గురించి మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా జగన్ మాటలున్నాయన్నారు. ప్రాజెక్ట్ను చూడకుండానే కొందరు కుహనా మేధావులు విమర్శలు చేస్తున్నారంటూ పరోక్షంగా ఉండవల్లి, కెవిపిలను ఆయన తప్పు బట్టారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే పోలవరం ఆగబోదని, తప్పకుండా పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో మంత్రి నోటి వెంట ఈ సారి 2019 అనే గడువు రాకపోవడం విశేషం. ఇప్పటిదాకా ఎప్పుడు పోలవరం ప్రస్తావన వచ్చినా, సదరు గడువులోగాఇ పూర్తి చేస్తామంటూ ప్రభుత్వాధినేతలు చెబుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరోక్ష సహాయ నిరాకరణతో… ఇక సిఎం గాని, మంత్రులు గాని తమ ప్రసంగాల్లో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి గడువు గురించి మాట్లాడే అవకాశం కనపడడం లేదు. ప్రాజెక్ట్ విషయంలో కేంద్రంతో చర్చించ నున్నామని మంత్రి ఉమ ఈ సందర్భంగా అన్నారు. రేపు (మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నామని వెల్లడించారు.