హరీష్ శంకర్ – దేవిశ్రీ ప్రసాద్… సూపర్ కాంబినేషన్. గబ్బర్ సింగ్ ఒక్కటి చాలు. వీళ్లు ఎలా ట్యూన్ అవుతారో చెప్పడానికి. డీజే కూడా మంచి మ్యూజికల్ హిట్. `గద్దల కొండ గణేష్` చిత్రానికీ దేవీనే అనుకొన్నారు. సంగీత దర్శకుడిగా దేవి పేరుని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఓ బలమైన కారణంతో దేవీ తప్పుకోవాల్సి వచ్చింది. అదెందుకో.. తన తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు దేవిశ్రీ ప్రసాద్.
”గద్దల కొండ గణేష్ కోసం నన్ను సంగీత దర్శకుడిగా ఎంచుకొన్నారు. హరీష్ నేరేషన్ కూడా ఇచ్చారు. ‘ఈ సినిమా చేసేద్దాం’ అనుకొనేలోగా ‘సర్ జీ.. ఇందులో ఓ రీమిక్స్ వుంది..’ అన్నారు. ‘వెల్లువొచ్చే గోదారమ్మ’ పాటని రీమిక్స్ చేద్దామనుకొంటున్నాం అని చెప్పారు. నేను రీమిక్స్ పాటలు చేయను. అది నా ప్రిన్సిపల్. దాంతో హరీష్ ఎంత కన్వెన్స్ చేద్దామనుకొన్నా నేను ఒప్పుకోలేదు. హరీష్‌తో పని చేయాలని ఉన్నా, రీమిక్ప్ కోసం ఆ సినిమా వదులుకొన్నా. చివరి నిమిషంలో నా కోసం రీమిక్స్ పాటని తీసేద్దాం అనుకొన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ‘ఈపాటని బాగా డిజైన్ చేశారు. నా కోసం తీయొద్దు’ అన్నాను. అలా ఆ సినిమా మిస్ అయ్యింది. అయితే ఓ ఇంటర్వ్యూలో హరీష్‌ని అడిగారు. మీ సినిమాలో దేవి ఎందుకు లేడు? అని. ఆయన వెంటనే ‘రీమిక్స్ చేయడం ఆయనకు ఇష్టం ఉండదు. అందుకే ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయారు’ అని హుందాగా సమాధానం ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఐ లవ్ యూ సర్ జీ.. అని నా మనసులోని ప్రేమని వ్యక్తం చేశా” అని గుర్తు చేసుకొన్నారు దేవిశ్రీ.
ఈ క్లిప్పింగ్ హరీష్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ”గుర్తింపు కోసం ఏదైనా మాట్లాడే ఈరోజుల్లో గుర్తు పెట్టుకొని మరీ మీరు ఇలా మాట్లాడడం కేవలం మీ గొప్పదనం. మీ సంగీతం గురించే కాకుండా మీ సంస్కారం గురించి కూడా అందరూ మాట్లాడుకొనేలా చేశారు” అని ట్వీట్ చేశారు.