వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో తెలుగు చిత్రసీమకు ఓ అభిరుచి గల దర్శకుడు వచ్చాడన్న నమ్మకాన్ని కలిగించాడు దేవాకట్టా. ఆటోనగర్ సూర్యపై కూడా చాలా అంచనాలు ఉండేవి. కానీ ఆ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవ్వడం, బడ్జెట్ పెరిగిపోవడం లాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది. కంటెంట్ బాగున్నా – దాన్ని సరైన రీతిలో ప్లేస్ చేయకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా తరవాత రూటు పూర్తిగా మారిపోయింది. డైనమేట్ లాంటి పెద్ద ఫ్లాప్ తీశాడు. ప్రస్థానం హిందీలో రీమేక్ చేసినా ఫలితం లేకుండా పోయింది.
నవతరం దర్శకులు విజృంభిస్తున్న ఈ తరుణంలో దేవాకట్టాకు మరో ఛాన్స్ వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఊహించని రీతిలో సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా ఓకే చేయించుకున్నాడు దేవాకట్టా. రాక రాక దేవ కట్టాకు ఓ మంచి ఛాన్స్ వచ్చింది. దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాల్సిన అవసరం తనకుంది. అందుకే.. ఈ స్క్రిప్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. ప్రస్థానంలా ఇదేం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా కాదు. పక్కా కమర్షియల్ సినిమా. కాకపోతే.. తనదైన మార్క్ చూపించబోతున్నాడట. నవతరం దర్శకులు కాన్సెప్ట్ బెస్డ్ సినిమాలు తీస్తున్నారు. దేవ కట్టా కూడా ఓ వినూత్నమైన కాన్ సెప్ట్ ని పక్కా వాణిజ్య హంగులతో తెరకెక్కిస్తున్నాడని, ఈ సినిమాతో కొత్త దేవ కట్టాని చూస్తారని చిత్రబృందం చెబుతోంది. నిజానికి ఇది ఓ వెబ్ సిరీస్ కోసం అనుకున్న కథ అట. అమేజాన్ ప్రైమ్ కోసం రాసుకున్న ఈ స్క్రిప్టు.. ఇప్పుడు సినిమాగా రూపాంతరం చెందుతోంది.