టీటీడీ గోశాలలో గత మూడు నెలలుగా వంద ఆవులు ప్రాణాలు కోల్పోయయాని వైసీపీ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతోన్న నేపథ్యంలో తిరుమలలో జరిగిన ఓ ఘటన సంచలనంగా మారింది. ముగ్గురు భక్తులు చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడం తీవ్ర దుమారం రేపుతోంది. క్యూలైన్ దాటుకొని ఏకంగా ఆలయ మహాద్వారం వరకు చెప్పులతో వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. దీనిపై టీటీడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.
ఎంతో భక్తి శ్రద్దలతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేషుని దర్శనం కోసం భక్తులు గంటలకొద్దీ క్యూలైన్ లో వేచి ఉంటారు. ఆ ఏడూ కొండల వాడి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది వస్తుంటారు. తిరుమల మాడ విధుల్లో సైతం ఎవరూ చెప్పులను ధరించరు. తిరుమలను ఎంతో పవిత్ర స్థలంగా భావిస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రమైన తిరుమలలో ముగ్గురు వ్యక్తులు చెప్పులతో దర్శనం కోసం వెళ్ళడం శ్రీవారి భక్తులను ఆగ్రహానికి గురి చేస్తోంది.
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో భక్తులు చెప్పులను అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళారు. అయితే , వారు పాదరక్షలు ధరించి కొంతదూరం ఎలా వచ్చారు? శ్రీవారి భక్తులే అయితే , పాదరక్షలు లోనికి అనుమతించరు అనే విషయం వారికి తెలియదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.
శుక్రవారం భూమన కరుణాకర్ రెడ్డి గోశాలలో గోవుల మృతిపై చేసిన ఆరోపణలను ఖండించారు టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి. ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ విషయం తిరుమలలో తీవ్ర దుమారం రేగుతుండగా.. ఇప్పుడు పాదరక్షలు ధరించి ముగ్గురు భక్తులు లోపలికి వెళ్ళడం కలకలం రేపుతోంది. దీని వెనక రాజకీయం ఏమైనా ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.