తెలంగాణ పోలీసులు ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించారని.. ఇతర పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా.. అది రాజకీయంగా కొట్టుకుపోయాయి. కానీ సాక్షాత్తూ హైకోర్టే తెలంగాణ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టుకు వచ్చి డీజీపీ వివరణ ఇవ్వాల్సిందేనని….న్యాయమూర్తులు స్ఫష్టం చేయడంతో.. డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు వచ్చారు. ఎస్పీ ఇచ్చిన సమాచారం మేరకు తానే మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు అంగీకరించారు
నిఘావర్గాలు ఇచ్చినట్లు చెబుతున్న నివేదికలు పోలీసులు కోర్టుకు సమర్పించారు. వాటన్నింటిపైనా హైకోర్టు అనుమానాలు వ్యక్తంచేసింది. ఒక్క నివేదికపైనా అధికారుల సంతకాలు, తేదీలు, అధికారిక ముద్రలు కూడా లేవని, నిఘావర్గాలే వాటిని ఇచ్చినట్టు ఎలా నమ్మాలని నిలదీసింది. కేవలం తమకు ఇవ్వడానికే సృష్టించినట్టు అవి కనబడుతున్నాయి తప్ప నమ్మశక్యంగా లేవని వ్యాఖ్యానించింది. నిఘావర్గాల నివేదికలు అలాగే ఉంటాయని,.. పోలీసులు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. బయట వ్యక్తులెవరైనా సృష్టించి సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే కూడా ఎవరినైనా అరెస్టు చేస్తారా? అని న్యాయమూర్తి పదే పదే ప్రశ్నించడంతో పోలీసులు నీళ్లు నమిలారు. పూర్తి వివరాలతో ఈ నెల 12న కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను17వ తేదీకి వాయిదా వేసింది.
ఈ వ్యవహారంలో పోలీసుల వ్యవహరించిన తీరు పక్షపాతంతో ఉందని కోర్టు ఆక్షేపించింది.అధికారపార్టీ సభను జరగనివ్వబోమని చెప్పినందుకే …రేవంత్‌ను అరెస్ట్ చేశారా?. అదేమాట అధికార పార్టీ నాయకుడు చెప్పి ఉంటే అరెస్ట్ చేసేవారా?అని న్యాయమూర్తి ప్రశ్నించడంతో పోలీసులు తలదించుకోవాల్సి వచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరు అది కాదని స్పష్టంచేసింది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఓ పద్ధతి ఉండాలని, హుందాగా వ్యవహరించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరో వైపు వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు వేశారు. అన్నపూర్ణ స్థానంలో అవినాష్ మహంతి నియమించారు. అన్నపూర్ణకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించరాదన్న ఈసీ ఆదేశించింది.