మ్యాధ్స్లో పీహెచ్డీ చేసిన వ్యక్తిని అందరి ముందు నిలబెట్టి.. అదో పరీక్షలా రెండో ఎక్కం చెప్పమంటే ఎలా ఉంటుంది..? ఇంగ్లిష్‌లో ఢక్కామొక్కీలు తిన్నవాడ్ని ఏమీ రాదని తేల్చినట్లుగా ఏబీసీడీలు చెప్పమంటే ఎలా ఉంటుంది..? .. ఆయా వ్యక్తులకు తలకొట్టేసినట్లుగా ఉంటుంది కదా.. అచ్చంగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ హైకోర్టులో అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఐపీఎస్‌గా… మూడు దశాబ్దాలకుపైగా సర్వీస్ ఉండి… ఏపీ పోలీస్ యంత్రాంగానికి బాస్‌గా ఉన్న ఆయనను హైకోర్టు న్యాయమూర్తులు … విశాఖలో చంద్రబాబుకు పోలీసులు ఇచ్చిన సీఆర్పీసీ సెక్షన్ 151 ఆర్డర్‌ను చదవమని ఆదేశించారు. చదివిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కోర్టులో కేసు ఉందని తీసుకోలేదని.. కోర్ట్ ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామన్న డీజీపీ కోర్టుకు చెప్పారు.
కోర్టు తీర్పు అవసరం లేదు, మీరు చర్యలు తీసుకోండి.. తాము తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్న హైకోర్టు సీజే స్పష్టం చేశారు. అదే సమయంలో.. కొద్ది రోజుల క్రితం.. అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకునే విషయంలో పోలీసులపైనా ప్రశ్నించింది. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 పేరుతో.. వందలాది మంది పోలీసుల మోహరింపును ధర్మాసనం ప్రస్తావించి.. పోలీసులు రూల్ ఆఫ్ లా పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. పోలీస్, న్యాయ వ్యవస్థలు చట్టాన్ని అమలు పరచాలన్న ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. దీంతో ఇకపై రూల్ ఆఫ్ లా సక్రమంగా అమలు చేస్తామన్న డీజీపీ సవాంగ్ హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఉదయం హైకోర్టుకు వచ్చిన డీజీపీ సాయంత్రం వరకూ.. అక్కడే ఉండాల్సి వచ్చింది.
ఆ తర్వాత డీజీపీ నేరుగా.. తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అడ్వకేట్ జనరల్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. పోలీసులు రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్న విషయాన్ని హైకోర్టు ప్రశ్నించడం… ఇక నుంచి అమలు చేస్తామని సవాంగ్ హామీ ఇవ్వడం.. న్యాయవాద వర్గాల్లోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికి డీజీపీ రెండు సార్లు పోలీసుల తీరుపై హైకోర్టు ఎదుట హాజరు కావాల్సి వచ్చింది.