ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఆలయాలపై జరుగుతున్న దాడుల దర్యాప్తు విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో కుట్రకోణం లేదని.. దొంగలు, నిధి వేటగాళ్లు, మూఢ నమ్మకాలు, ఆస్తి గొడవలు, పిచ్చివాళ్లు, అడవి జంతువులు కారణమని చెప్పుకొచ్చారు. అరెస్ట్ చేసిన వారిలో అంతర్రాష్ట్ర ముఠాలు కూడా ఉన్నాయన్నారు. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. వివిధ ఘటనలు జరిగిన కారణాల్ని కూడా వెల్లడించారు. అయితే.. రెండు రోజులు గడిచే సరికి.. పండగ పూట మీడియాతో మాట్లాడి.. కుట్ర కోణాల్ని ఆవిష్కరించారు.
వివిధ ఆలయాలపై జరిగిన 9 ఘటనలకు సంబంధించి పలు రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని కొత్తగా చెప్పుకొచ్చారు. ప్రతీ ఘటన తర్వాత సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని కూడా చెప్పుకొచ్చారు. 21 మంది రాజకీయ పార్టీల కార్యకర్తలకు ప్రమేయం ఉన్నట్లు తేలిందని ఈ వ్యవహారాలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారంపైనే డీజీపీ ఎక్కువ కోపంగా ఉన్నారు. అదంతా రాజకీయ పార్టీల కుట్రని చెబుతున్నారు.
ఓ వైపు అధికార పార్టీ పూర్తిగా ఆలయాలపై దాడులను విపక్షాలు చేస్తున్న కుట్రగా చెబుతోంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా… టీడీపీ, బీజేపీల పనేనని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో డీజీపీ మొదట ఎలాంటి కుట్రలు లేవని చెప్పడం.. తర్వాత రాజకీయ పార్టీల హస్తం ఉందని మాట మార్చడం … రాజకీయ ఒత్తిడుల వల్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎలాగోలా.. విమర్శలు చేయకుండా… విపక్షాలను ఆత్మరక్షణలో పడేయాలంటే.. వారిపై కేసులు బనాయించక తప్పదన్న వ్యూహంలో ఉన్నట్లుగా విపక్షాలు అనుమానిస్తున్నాయి. రామతీర్థం ఘటనలో పట్టుబట్టి టీడీపీ నేతల్నే అనుమానితులుగా తీసుకుని వేధించడాన్ని దీనికి సాక్ష్యంగా చెబుతున్నారు.