ధనుష్ – ఐశ్వర్య విడిపోవడం చిత్రసీమకు పెద్ద షాక్. నిన్నా మొన్నటి వరకూ అన్యోన్యంగా కనిపించిన ఈ జంట… సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. సూపర్ స్టార్ రజనీ, ధనుష్ ఫ్యాన్స్‌కి అయితే ఇది ఊహించని పరిణామం. అయితే.. ఇది పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయమని, తమ అభిప్రాయాన్ని గౌరవించాలని ధనుష్, ఐశ్వర్య కోరుతున్నారు. వాళ్ల జీవితంలో ఇదో కీలకమైన నిర్ణయం. పద్దెనిమిదేళ్ల బంధానికి తెర దించడం ఏ జంటకైనా సవాలే. సంక్లిష్టమైన నిర్ణయమే.
రజనీకాంత్ కి ధనుష్ అల్లుడవ్వడం అప్పట్లో ఇలానే అందరినీ షాక్ కి గురి చేసింది. అప్పటికి ధనుష్ పెద్ద స్టారేం కాదు. అయినా.. రజనీ తన అల్లుడ్ని చేసుకున్నాడు. దాంతో…. ధనుష్ అదృష్టానికి అందరూ కుళ్లుకున్నారు. ఇప్పుడు సడన్ గా విడాకులు తీసుకుని.. వాళ్లని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు ధనుష్.
ధనుష్ – ఐశ్వర్యలది ప్రేమ వివాహమే. అయితే ఆ ప్రేమ కథ కూడా సినిమాటిక్ గానే మొదలైంది. ధనుష్ నటించిన `కాదల్ కొండెన్` సినిమాని థియేటర్లో చూసింది ఐశ్వర్య. ధనుష్ నటన నచ్చి.. ధనుష్ ఇంటికి ఓ బొకే పంపించింది. `టచ్‌లో ఉండు…`అని సందేశంతో. ఆ సందేశం.. ధనుష్ కి ఆశ్చర్యాన్ని కలిగించిందట. సూపర్ స్టార్ కూతురు..`టచ్‌లో ఉండు` అని చెప్పడంతో.. ధనుష్ ఫిదా అయిపోయాడు. అక్కడి నుంచి.. ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ధనుష్ – ఐశ్వర్యలు క్లోజ్‌గా ఉండడం గమనించిన తమిళ మీడియా… వాళ్లపై ఫోకస్ చేసింది. ప్రేమ పక్షులు అంటూ కథనాలు అల్లింది. నిజానికి అప్పటికి వారిద్దరి మధ్య ఉన్నది ప్రేమ అనే సంగతి వారిద్దరికీ తెలీదట. మీడియా కథనాల్ని వాళ్లూ పాజిటీవ్‌గా తీసుకున్నారు.
ధనుష్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. అయినా వీరి ప్రేమకు అది అడ్డు కాలేదు. తమ ప్రేమ వ్యవహారాన్ని ముందు రజనీ ముందే ఉంచారు. రజనీ సానుకూలంగా స్పందించడంతో.. పెద్దలంతా ఒక్కటై 2004లో వీరిద్దరి పెళ్లి చేశారు. ఈ జంటకు ఇద్దరు అబ్బాయిలు. ధనుష్ కెరీర్లో ఐశ్వర్య ప్రమేయం చాలా ఉంది. కథల ఎంపిక, కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఐశ్వర్య దగ్గరుండి చూసుకునేది. ఇప్పుడు ఈ బంధానికి బీటలు వారాయి.