ఈమధ్య ధనుష్ టాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. ఇక్కడ ‘సార్’ చేశాడు ధనుష్. ఇప్పుడు శేఖర్ కమ్ములతో ‘కుబేర’లో నటిస్తున్నాడు. ఇకపై కూడా యేడాదికి ఓ తెలుగు సినిమా చేయాలని ఫిక్సయ్యాడట. దానికి కారణం.. తెలుగులో పారితోషికం తమిళం కంటే ఎక్కువ లభించడం. ధనుష్ నిన్నా మొన్నటి వరకూ ఓ తమిళ చిత్రానికి రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకూ తీసుకొనేవాడు. తెలుగులో తన పారితోషికం దాదాపు రూ.40 కోట్లు. ఇటీవల మరో నిర్మాత ధనుష్కి కలిసి, ఓ కథ వినిపించాడట. ఆ సినిమా కోసం రూ.50 కోట్ల పారితోషికం అడుగుతున్నట్టు టాక్. ధనుష్ అడిగినంత ఇవ్వడానికి ఆ నిర్మాత కూడా రెడీగానే ఉన్నాడని తెలుస్తోంది.
ధనుష్ ఒక్కడే కాదు. తమిళ హీరోలకు తెలుగులో బాగానే పారితోషికాలు ముడుతున్నాయి. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈమధ్య తెలుగుపైనే ఫోకస్ చేస్తున్నాడు. దానికి కారణం.. అక్కడ కంటే ఇక్కడ పారితోషికాలు ఎక్కువ. ధనుష్, దుల్కర్ లకు తెలుగులో మార్కెట్ వున్న మాట వాస్తవం. అయితే వీళ్లు తెలుగులో సినిమాలు చేస్తే, అవి కేవలం తెలుగు సినిమాలుగానే చలామణీ అవుతాయి. ‘సార్’ సినిమాని తమిళ ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాగానే చూశారు. ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ సినిమాల్ని కన్నడ ప్రేక్షకులు తెలుగు సినిమాగానే భావించారు. వాళ్లకు ఈ విషయాల్లో మంచి క్లారిటీ వుంది. రెండు రాష్ట్రాల్లోనూ ఒకేరకమైన మార్కెట్ ఉన్నప్పుడు సదరు హీరోలకు అడిగినంత పారితోషికాలు ఇవ్వడంలో తప్పు లేదు. అలాకానప్పుడు పారితోషికాలు అడిగినంత ఇచ్చేసి, చేతులు కాల్చుకోవడం నిర్మాతలు చేస్తున్న పెద్ద తప్పు. పరభాషా హీరోల కాల్షీట్ల వెంట పరుగులు పెడుతున్న తెలుగు నిర్మాతలు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదేమో..?!