ధనుష్ ఈమధ్య తెలుగు దర్శకులు, తెలుగు నిర్మాతలపై దృష్టి పెట్టాడు. ‘సార్’ అలా వచ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చేస్తున్నాడు. ఈలోగా మరో తెలుగు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈసారి దిల్ రాజు బ్యానర్లో ధనుష్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ‘శ్రీకారం’తో మెప్పించిన కిషోర్ బి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ‘కుబేర’ అయిపోగానే… దిల్ రాజు బ్యానర్లో సినిమా మొదలవుతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ధనుష్ తో ఓ సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అయితే తగిన కథ సెట్ అవ్వలేదు. కిషోర్ చెప్పిన కథ… ధనుష్కి బాగా సెట్ అవుతుందని దిల్ రాజు భావించడం, దాన్ని ధనుష్ ముందుకు తీసుకెళ్లడం, ధనుష్ కూడా ‘ఓకే’ చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. శర్వానంద్ ‘శ్రీకారం’ బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాన్నే అందుకొంది. ఆ కథలో సామాజిక అంశాన్ని దర్శకుడు మేళవించిన తీరు ఆకట్టుకొంది. మళ్లీ అలాంటి కథతోనే కిషోర్ ఈ స్క్రిప్టు తయారు చేసుకొన్నట్టు టాక్. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు.