రజనీకాంత్ ‘కాలా’ కాన్సెప్ట్ ఏంటి? కథేంటి? – రజనీ అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్న ప్రశ్నలవి. అదో.. మినీ డాన్ నేపథ్యంలో సాగే కథ అని ట్రైలర్లు, రజనీ గెటప్పులూ చూస్తుంటే అర్థమవుతోంది. అయితే.. ఈసినిమాలో చర్చించబోయే అసలు విషయం ఏమిటన్నది ధనుష్ చెప్పాడు. ‘కాలా’ సినిమాకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ గురించి ధనుష్ క్లూ ఇచ్చాడు. ‘భూ సమస్య’పై ఈ సినిమా సాగబోతోందని హింట్ ఇచ్చేశాడు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో ఉంది. అక్కడ సాగే కథ ఇది. దేశంలోని దాదాపు 60 శాతం మందికి సొంత భూమి లేదు. దానికి కారణం ఎవరు? అసలు మురికివాడలు ఎందుకు తయారవుతున్నాయి? భూముల్ని స్వాహా చేస్తున్న పెద్ద స్వాములు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం కాలాలో కనిపిస్తుందట. ”భూసమస్య అనే కాదు.. ఇందులో చాలా అంశాలు చర్చించాం. నిజ జీవితంలో మనకు ఎదురయ్యే అనేక సమస్యలపై కాలా పోరాడతాడు. రజనీకాంత్లోని అసలు సిసలైన హీరోయిజం ఈ సినిమాలో చూడబోతున్నారు” అన్నాడు పా. రంజిత్. తమిళనాడులో రాజకీయ సెగ ఎక్కువగా ఉంది. దానికి తోడు రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టేశాడు. ఈ నేపథ్యంలో పొలిటికల్ సెటైర్లకూ ‘కాలా’లో ఆస్కారం కనిపిస్తోంది.