హైదరాబాద్: ‘రఘువరన్ బీటెక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన తమిళ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఒక హాలీవుడ్ చిత్రంలో లీడ్ రోల్‌కు బుక్ అయ్యారు. పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్ వంటి చిత్రాల హీరోయిన్ ఉమ్ తుర్మన్, పెర్సీ జాక్సన్, ట్రూ డిటెక్టివ్ చిత్ర హీరోయిన్ అలెగ్జాండ్రా డడ్డారియో వంటి హాలీవుడ్ ప్రముఖుల సరసన ధనుష్ ఈ చిత్రంలో నటించబోవటం విశేషం. ఈ చిత్రం టైటిల్ విచిత్రంగా, చాలా పొడవుగా ఉంది… ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ఎ ఫకీర్ హూ గాట్ ట్రేప్డ్ ఇన్ ఇకియా కప్బోర్డ్. ఫ్రెంచ్ రచయిత ఇదే పేరుతో రాసిన ఒక నవల ఆధారంగా ఫ్రెంచ్ రచయిత్రి, దర్శకురాలు మర్జానే సత్రపి ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ధనుష్ ఈ చిత్రంలో అజా అనే ఒక గారడీవాడి పాత్ర పోషిస్తారు. అతనిని అతని తల్లి ఒక రహస్య కార్యంపై ప్యారిస్ పంపుతుంది. ఈ చిత్రాన్ని ఇండియా, ఫ్రాన్స్, మొరాకో, ఇటలీ దేశాలలో చిత్రీకరిస్తారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం తాను చాలా ఇండియన్ సినిమాలను చూశానని, ఆ క్రమంలో ధనుష్ అయితేనే తన పాత్రకు సరిపోతాడని భావించి ఎంపిక చేసుకున్నానని దర్శకురాలు మర్జానే చెప్పారు.