అన్ని అనుకున్నట్లు జరిగివుంటే ధనుష్ ‘కెప్టన్ మిల్లర్’ ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది. కానీ తెలుగు సినిమాలకే థియేటర్స్ కొరత రావడం వలన వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ట్రైలర్ వదిలారు. ట్రైలర్.. కెప్టన్ మిల్లర్ పాత్రని, కథని పరిచయం చేస్తుంది. దేశానికి ఫ్రీడమ్ రావడానికి ముందు జరిగే కథ ఇది. కథానాయకుడు ఒక రెబల్. అతను బ్రిటిష్ ద్రుష్టిలో డకాయిట్, స్థానిక ప్రజల ద్రుష్టిలో దేశ ద్రోహి. ఈ రెండు కోణాలు కలిగిన హీరో తన దేశ కోసం, ప్రజల కోసం ఏం చేశాడనేది మిగిలిన కథ అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది.
దునుష్ లుక్స్ గెటప్స్ బావున్నాయి. మంచి యాక్షన్ కూడా వుంది. సందీప్ కిషన్, శివ రాజ్ కుమార్ లాంటి ప్రముఖ నటులు ట్రైలర్ లో ఒక్క షాట్ కే పరిమితమయ్యారు. జీవీ ప్రకాష్ అందించిన నేపధ్య సంగీతం బావుంది. ప్రొడక్షన్ డిజైన్ వింటేజ్ లుక్ ని బాగానే పట్టుకుంది. దేశం, ఫ్రీడమ్, అణిచివేత, తిరుగుబాటు.. ఇలాంటి అంశాలతో ముడిపడిన సినిమా ఇది. జనవరి 25న ప్రేక్షకుల ముందు వస్తోంది. రిపబ్లిక్ డే వైబ్ ఈ సినిమాకి కలిసొచ్చే అవకాశం వుంది.