దర్శకులు తమ స్టైల్‌ని వదిలి, కొత్తగా ఆలోచించాల్సిన రోజులు వచ్చాయి. ప్రేక్షకుల్ని ఎంతలా సర్ప్రైజ్ చేస్తే అంత పెద్ద విజయాలు దక్కుతున్నాయి. అందుకే శేఖర్ కమ్ముల కూడా రూటు మార్చారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘కుబేర’ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అదే అనిపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. రష్మిక కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఈరోజు విడుదల చేశారు. కథేమిటి? పాత్రల స్వభావం ఏమిటి? అనే విషయాలు గ్లింప్స్ లో దాచిపెట్టినా, చూపించిన షాట్స్, ఆ ఎమోషన్ ఇవన్నీ బాగా హై ఇచ్చాయి. శేఖర్ కమ్ముల ఏదో ఓ కొత్త కథ చెప్పబోతున్నాడన్న నమ్మకాన్ని కలిగించాయి. ధనుష్ గెటప్ ఇది వరకే రివీల్ చేసినా, గ్లింప్స్ లో కుక్కను పట్టుకొని కనిపించిన షాట్.. ప్రత్యేకంగా నిలుస్తుంది. శేఖర్ కమ్ముల సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ పని చేయడం ఇదే తొలిసారి. దేవి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎమోషన్ ని క్యారీ చేసే ప్రయత్నం చేశాడు.
ఈ క్రిస్మస్ కి ఈ చిత్రం ఉండొచ్చని, లేదంటే సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ఓ స్పష్టత రాలేదు. గ్లింప్స్ లో రిలీజ్ డేట్ ప్రస్తావన లేదు. శేఖర్ కమ్ముల సినిమాలన్నీ నిదానంగా నడుస్తుంటాయి. రిలీజ్ డేట్ విషయంలో ఆయనకు కంగారు ఉండదు. సినిమా అంతా పూర్తయ్యాక, ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొన్న తరవాత రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగే అవకాశం వుంది.