తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం ఉద్ధృతంగా సాగింది. అాలాగే గ్రామాల్లో లెక్కకు మిక్కిలిగా సమస్యలు వచ్చాయి. రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగిన రైతులు పడిన బాధలు వారికే తెలుసు. అంతిమంగా బాధలు పడిన వారంతా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేశారు. బీఆర్ఎస్ కంచుకోటలనుకున్న నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ల్యాండ్ మైన్‌లా పేరుతోంది. . ప్రభుత్వం భూములు గుంజుకునేందుకే ఈ చట్టాన్ని తెచ్చిందని విపక్షాలు. లేదు మీ భూముల పరిరక్షణకే ఈ చట్టమని అధికార పక్షం ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఫలితంగా చట్టంలో లొసుగులపై విస్తృత చర్చ జరుగుతోంది. ఒక్కో అంశం.. ఎంత ప్రమాదకమైనదో లాయర్ల విశ్లేషణలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ భయం ఏర్పడుతోంది. ఇది వైసీపీకి పెను సవాల్ గా మారనుంది.
ధరణి అమల్లోకి వచ్చింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటికే చేసిన సర్వేలో తమ భూమి పరిణామం తగ్గిపోయిందని గగ్గోలు పెడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఇవన్నీ కలిసి వైసీపీ సర్కార్ ను నడి సముద్రంలో కలిపేయడం ఖాయంగా కనిపిస్తోంది. భూములు జోలికి వచ్చిన ఏ ప్రభుత్వానికైనా ఇదే పడుతుందని ఏపీ ప్రజలూ నిరూపించే పరిస్థితులు ఏర్పడ్డాయి.