తెలంగాణ ప్రభుత్వం రెవిన్యూ సమస్యల పరిష్కరానికి సరికొత్త ప్రయత్నం చేస్తోంది. భూభారతి చట్టాన్ని ఇది వరకే అసెంబ్లీలో ఆమోదించిన ప్రభుత్వం తాజాగా పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా మూడు మండలాల్లో భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నారు. భూభారతి పోర్టల్ పై ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరించి పోర్టల్ ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతిని తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ధరణి .. కేసీఆర్ ఓడిపోవడానికి కారణాల్లో ఒకటి. కేసీఆర్ భూ సమస్యలను పరిష్కరించడానికి ధరణిని తీసుకు వచ్చారు. కారణం ఏమైనా కానీ అది సమస్యలను పెంచింది. ఈ కారణంగానే గ్రామాల్లో ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను రేవంత్ రెడ్డి పక్కాగా క్యాష్ చేసుకున్నారు. తాము ధరణిని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారు. భూభారతిని తీసుకు వచ్చారు.
చట్టంలో ఏమున్నదని కాదు.. అమలులో ఎంత సమర్థంగా ఉన్నదని కీలకం. ధరణిలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ లోపాల ముందు అవేమీ నిలబడలేదు. భూభారతితోనూ ముందుగానే అనేక సమస్యలు ఎంచి చూపిస్తున్నారు. ప్రాక్టికల్ గా వచ్చే సమస్యలే అత్యంత కీలకం. వాటిని పరిష్కరించడం కూడా అంతే వేగంగా..అధికారులు లంచాల కోసం మీద పడకుండా ఉండేలా చేయాల్సి ఉంది. ధరణిలో తక్కువ భూమి చూపించడం.. ఆన్ లైన్ కాకపోవడం వంటి సమస్యలు పునరావృతం అయితే అసలుకే మోసం వస్తుంది.
ధరణి కంటే బెటర్ భూభారతి అని అనిపించేలా చేస్తేనే వ్యతిరేకత రాకుండా ఉంటుంది. దాని కోసం ఆషామాషీగా నిర్ణయాలు తీసుకుని.. నిబద్ధత లేని అధికారులతో పనులు చేయిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇది భూములకు సంబంధించిన విషయం కాబట్టి.. తెలంగాణ ప్రభుత్వం వంద శాతం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది.